
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో మూడో టీ20 కోసం భారత క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. భారత ఆటగాళ్లకు హెచ్‌సీఏ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో శంషాబాద్ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు, హోటల్ పార్క్ హయత్‌లో భారత ఆటగాళ్లకు బస ఏర్పాట్లు చేశారు. ఉప్పల్‌లో రేపు జరగనున్న మ్యాచ్‌తో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం కావడంతో మూడో టీ20 మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది.
మరోవైపు, తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ పేలవంతో ఓటమి చవిచూసింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో విజయం సాధించింది. అదే జోరును రోహిత్ సేన కొనసాగించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటుకున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ఇండియా ఈ సిరీస్ గెలవడం కూడా ఎంతో కీలకం.
ఈ మ్యాచ్ టికెట్ల కోసం లాఠీ దెబ్బలు తిన్న అభిమానులు.. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు సిద్దమయ్యారు. టికెట్ల అమ్మకాల విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో హెచ్‌సీఏ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ మ్యాచ్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే 2500 మంది పోలీసులతో ఈ మ్యాచ్‌కు పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేసింది. మరోవైపు మైదానంలో సీట్ల విషయంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో హెచ్‌సీఏ అధికారులు శుభ్రం చేయించారు. విరిగిన కుర్చీలకు మరమ్మత్తు చేయించారు.