
మొహాలీ: భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ తెలిపాడు. పిచ్ కూడా చాలా ఫ్లాట్‌గా ఉందని, టీ20 ప్రపంచకప్ ముందు ఈ సిరీస్‌ను సన్నాహకంగా వాడుకుంటామని తెలిపాడు. ఐపీఎల్‌లో దుమ్మురేపిన టీమ్ డేవిడ్.. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసాడు.
ఇక గాయం నుంచి కోలుకొని ఈ సిరీస్‌కు ఎంపికైన టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను స్వల్ప గాయంతో బాధపడుతున్నాడని, గేమ్ బ్రేక్ తీసుకుంటున్నాడని, రెండో టీ20 లేదా మూడో టీ20లో బరిలోకి దిగుతాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
రిషభ్ పంత్‌ను పక్కనపెట్టి దినేశ్ కార్తీక్‌ను తీసుకున్నామని, అక్షర్ పటేల్, చాహల్‌తో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. 'మా సత్తాను పరీక్షించుకునేందుకు ఇదో మంచి అవకాశం. ప్రతీ మ్యాచ్ ఓ గుణపాఠం నేర్పుతుంది. గత ఆరు ఏడు నెలలుగా మ్యాచ్‌లు ఎలా గెలవాలనే విషయంలో చాలా నేర్చుకున్నాం. ఈ సిరీస్ మాకు చాలా ప్రత్యేకమైనది. ఆసియా కప్‌లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఈ సిరీస్ మాకు మంచి అవకాశం. దురదృష్టవశాత్తు జట్టులో కొంతమంది గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.
జస్‌ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకోలేదు.. ఓ రెండు మ్యాచ్‌ల వరకు అతను విశ్రాంతి తీసుకోనున్నాడు. రెండో టీ20 లేదా మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. పంత్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదు. టీమ్ కాంబినేషన్ నేపథ్యంలోనే పంత్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది. ఇద్దరు స్పిన్నర్లు అక్షర్ పటేల్, చాహల్‌తో బరిలోకి దిగుతున్నాం'అని రోహిత్ శర్మ తెలిపాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ బుమ్రా స్థానంలో చోటు దక్కించుకున్నాడు. హర్షల్ పటేల్ జట్టులోకి రావడంతో అర్ష్‌దీప్ సింగ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్