
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. 96/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదిలోనే కెప్టెన్ అజింక్యా రహానే(22), హనుమ విహారీ(4) వికెట్లను చేజార్చుకుంది. కమిన్స్ బౌలింగ్‌లో రహానే క్లీన్ బౌల్ట్ కాగా.. హనుమ విహారీ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 142 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(29 బ్యాటింగ్)తో నయావాల్ చతేశ్వర్ పుజారా(42 నాటౌట్)ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఆచితూచి ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. మరోవైపు పంత్ కూడా తన శైలికి భిన్నంగా ఓపికగా ఆడటంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ రెండు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ 1 వికెట్ తీశాడు. ఇక ఆసీస్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. స్టీవ్ స్మిత్(131) సూపర్ సెంచరీ.. లబుషేన్(91) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. ఇంకా ఆసీస్ కన్నా 158 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ గట్టెక్కాలంటే పుజారా, పంత్‌లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిందే. లేకుంటే భారత్‌కు కష్టాలు తప్పవు.