
సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా( 176 బంతుల్లో 5 ఫోర్లతో 50) అర్ధశతకం సాధించాడు. అయితే, ఇది అతని కెరీర్‌లో అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీగా మిగిలిపోయింది. ఇంతకుముందు పుజారా 2018లో సౌతాఫ్రికాపై 173 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, ఈ మ్యాచ్‌లో 174 బంతుల్లో ఆ రికార్డును అధిగమించాడు.
ఇక పుజారా నెమ్మదైన బ్యాటింగ్ భారత్ కొంపముంచిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శించాడు. ట్విటర్ వేదికగా పాంటింగ్ శనివారం పలువురు అభిమానులతో చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని పుజారా బ్యాటింగ్‌ను ప్రస్తావించాడు.'ఈ మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా తొలి 100 బంతుల్లో 16 పరుగులే చేశాడు. సిడ్నీ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై అతనిలా ఆడటం సరైనదే అంటారా?' అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రికీ.. ఇది సరైనది కాదన్నాడు. చతేశ్వర్ పుజారా ఇంకాస్త వేగంగా ఆడాల్సిందన్నాడు. ఇలా ఆడటం వల్ల మరో ఎండ్‌లో ఉండే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో పుజారా మూడో రోజు పంత్(36)తో కలిసి ఐదో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం ఇద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. మరోవైపు టెయిలెండర్లు సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో భారత్ 244 పరుగులకు ఆలౌటైంది. ఆపై ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 103/2తో కొనసాగుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 197 పరుగుల ఆధిక్యం సాధించింది.