
సిడ్నీ: ఐపీఎల్ 2020 సీజన్ దిగ్విజయంగా పూర్తవడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. కరోనా నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. సిడ్నీలోని పుల్‌మాన్ హోటల్లో టీమిండియా ఆటగాళ్ల బస చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాట్లు చేసింది. అయితే.. తాజాగా సిడ్నీలో ఓ విమానం కూలిపోవడంతో భారత్ అభిమానుల్లో కంగారు మొదలైంది. మరీ ముఖ్యంగా.. ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే క్రోమర్ పార్క్‌లో విమానం కూలిపోయినట్లు వార్తలు రావడంతో భారత క్రికెటర్లు సురక్షితమేనా..? అని అభిమానులు గూగలమ్మను అడగడం మొదలుపెట్టారు.
అయితే.. భారత క్రికెటర్లు బస చేసిన హోటల్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఆ విమానం కుప్పకూలినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విచారణలో అది ఒక ఫ్లయింగ్ స్కూల్‌కు చెందిన విమానంగా తేలింది. వాస్తవానికి క్రోమర్ పార్క్‌లో విమానం కూలే సమయానికి అక్కడ 12 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
విమానం నుంచి దట్టమైన పొగ వ్యాపించిందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దాంతో.. తాము విమానంలో ఉన్న వారి పని అయిపోయిందని భావించామని.. అయితే.. అందులో ఉన్న ఇద్దరూ గాయాలతో బయటపడినట్లు తెలిపారు. కానీ.. ఒక ఫైలెట్‌కి మాత్రం ముఖంపై తీవ్ర గాయమైందని.. మరొకరికి వెన్నుముక దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు.
సుమారు మూడు నెలల ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్ ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు, టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. నవంబరు 27 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ పూర్తి బయో- సెక్యూర్ వాతావరణంలో జరగనుంది. కరోనా అనంతరం భారత్ ఆడుతున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ సిరీస్ ఇదే కావడంతో కోహ్లీసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.