
మెల్‌బోర్న్: డే/నైట్ టెస్ట్‌లో భారత్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియాకు శుభవార్త. శనివారం మైదానంలో గాయపడ్డ యువ ఓపెనర్ జో బర్న్స్ కోలుకున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగే తదుపరి బాక్సింగ్ డే టెస్ట్‌కు అతను సిద్దంగా ఉన్నాడని ఆస్ట్రేలియా టీమ్ వర్గాలు తెలిపాయి. కాకపోతే ఎన్నో అంచనాలున్న యువ ఓపెనర్ విల్ పుకోవిస్కి మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, అతను రెండో టెస్ట్ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయని ఆసీస్ మీడియా పేర్కొంది. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టి భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన పుకోవిస్కీ.. ఫస్ట్ వామప్ మ్యాచ్‌లో కంకషన్‌కు గురైన విషయం తెలిసిందే. దాంతో అతను ఫస్ట్ టెస్ట్‌కు దూరం కాగా.. అతని స్థానంలో జోబర్న్స్ చోటు దక్కించుకున్నాడు.
ఇక తాజా మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలర్‌లో బర్న్స్ మోచేతికి తీవ్ర గాయమైంది. బంతి బలంగా తగలడంతో బర్న్స్ నొప్పితో విలవిలలాడాడు. దాంతో అతను కూడా ఆసీస్ గాయాల ఆటగాళ్ల జాబితాలో చేరాడని అంతా అనుకున్నారు. కానీ అతనికైన గాయం చిన్నదేనని తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని టీమ్ వర్గాలు తెలిపాయి. ఇక వన్డే సిరీస్ సందర్భంగా గజ్జ గాయానికి గురైన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది.
ఇక ఫస్ట్ టెస్ట్‌లో ఆసీస్ 8 వికెట్లతో అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పేసర్లు జోష్ హాజల్‌వుడ్ (5/8), ప్యాట్ కమిన్స్ (4/21) భారత జట్టు వెన్నువిరిచారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 21 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 2 వికెట్లకు 93 పరుగులు సాధించి గెలిచింది. జో బర్న్స్ (63 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్ (53 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించాడు.