
హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో ఇప్పుడు చర్చంతా టీమిండియా అప్‌కమింగ్ ఆస్ట్రేలియా టూర్ వైపు మళ్లింది. త్వరలోనే జంబో జట్టుతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్ తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్ ఆడనుంది. సుమారు మూడు నెలల పాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్‌తో పాటు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పోటీ పడనుంది. ఓ డే నైట్ మ్యాచ్ కూడా ఉన్న ఈ టెస్టు సిరీస్‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అయితే ఈ సంప్రదాయక సిరీస్‌లోని చివరి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో తండ్రి కాబోతుండడంతో కోహ్లీకి బీసీసీఐ పెటర్నటీ సెలవులు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే గాయం కారణంగా టూర్‌కు తొలుత ఎంపిక కాని ఓపెనర్ రోహిత్ శర్మను టెస్టు సిరీస్ కోసం తీసుకుంది. అతడికి పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి పూర్తిగా విశ్రాంతినిచ్చింది. అయితే విరాట్ కోహ్లీ లేని ఈ టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ నెగ్గేస్తుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ గైర్హాజరీపై మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించిన ఈ ఇంగ్లండ్ మాజీ ప్లేయర్.. కోహ్లీ నిర్ణయాన్ని సమర్దిస్తూనే భారత్ విజయం సాధించడం కష్టమన్నాడు.
'విరాట్ కోహ్లీ లేని భారత జట్టు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం కష్టం. కోహ్లీ తన ఫస్ట్ చైల్డ్ కోసం తీసుకున్న నిర్ణయం సరైందే. కానీ ఇది ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. నా అభిప్రాయం ప్రకారం ఆ జట్టు సునాయస విజయాన్నందుకుంటుంది.'అని వాన్ ట్వీట్ చేశాడు. దీనికి #JustSaying అనే ట్యాగ్‌ను జత చేశాడు.
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలవడంపై కూడా ట్విటర్ వేదికగా స్పందించిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. రోహిత్ శర్మ సారథ్యంపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ సారథ్యంలోని ముంబై జట్టు టీ20 ప్రపంచకప్ కూడా గెలుస్తుందని కొనియాడాడు. 'ఇక ప్రశ్నలు అనవసరం.. రోహిత్ శర్మను టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయాలి. ఆటగాళ్లను ఎలా వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. అద్భుత లీడర్. టీ20 గేమ్‌లను ఎలా గెలవాలో రోహిత్‌కు బాగా తెలుసు. అతడిని టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్ చేయడం వల్ల విరాట్ కోహ్లీకి కూడా భారం తగ్గే అవకాశం ఉంది. మిగతా జట్లు ఈ విధానాన్ని (ఇద్దరు కెప్టెన్లు)అనుసరించి ఫలితం రాబడుతున్నాయి' అని సూచించాడు.