
సిడ్నీ: భారత్‌తో జరగనున్న అప్‌కమింగ్ లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌ల నుంచి ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్ తప్పుకున్నాడు. తనకు కొడుకు పుట్టడంతో రిచర్డ్సన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం స్పష్టం చేసింది. ఇక రిచర్డ్సన్ స్థానాన్నిఆండ్రూ టైతో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.
'కేన్ తీసుకున్న నిర్ణయం కఠినమైనదే. కానీ అతనికి పుట్టిన కొడుకు కోసం అడిలైడ్‌లో ఉండాలనుకున్నాడు. కేన్ నిర్ణయానికి టీమ్, సెలెక్టర్లు అండగా నిలిచారు. మేం ఎప్పుడూ మా ఆటగాళ్లు వారి కుటుంబాలకు మద్దతునిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకోవడం కష్టం. అందుకే అతన్ని నిర్ణయాన్ని అర్థం చేసుకోని మద్దతుగా నిలిచాం'అని ఆసీస్ సెలెక్టర్ ట్రెవర్ హోన్స్ తెలిపారు. ఇప్పటి వరకు 25 వన్డేలు, 21 టీ20లు ఆడిన కేన్ రిచర్డ్సన్.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 39 వికెట్లు, పొట్టి క్రికెట్‌లో 22 వికెట్ల తీశాడు. 33 ఏళ్ల ఆండ్రూ టై 7 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ పర్యటనకు టై బ్యాకప్ పేసర్‌గా వెళ్లాడు.
ఇక సౌత్ ఆస్ట్రేలియాలో పెరిగిన కరోనా కేసుల కారణంగా జోష్ ఫిలిప్, డీ ఆర్సీ షార్ట్‌లను కూడా జట్టులో చేర్చామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. బిగ్ బాష్ లీగ్ ప్రారంభమయ్యే వరకు వారు జట్టుతో ప్రాక్టీస్ చేస్తారని తెలిపింది. కరోనా వైరస్ కేసుల కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు షెడ్యూల్ దెబ్బ తినరాదని భావించిన బోర్డు (సీఏ) వేగవంతంగా తగిన చర్యలు చేపట్టింది.
కోవిడ్-19 సమస్య ఉన్న అడిలైడ్ నుంచి ప్రత్యేక విమానంలో తమ ఆటగాళ్లందరినీ సిడ్నీ (న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం)కి తరలించింది. సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలన్నీ తమ సరిహద్దులను మూసివేశాయి. సీఏ తరలించిన ఆటగాళ్లలో టెస్టు కెప్టెన్ టిమ్ పైన్, మార్నస్ లబ్‌షేన్, మాథ్యూ వేడ్, ట్రావిస్ హెడ్, గ్రీన్ ఉన్నారు. నవంబర్ 27 సిడ్నీ వేదికగా జరిగే ఫస్ట్ వన్డేతో భారత్-ఆస్ట్రేలియా పర్యటన మొదలవ్వనుంది.