అచ్చం అలానే ఆడుతున్నాడు.. భారత జట్టులోకి మరో ధోనీ వచ్చాడు: ఆస్ట్రేలియా కోచ్

సిడ్నీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలోనే హార్దిక్ కూడా చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపిస్తున్నాడన్నాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
హార్దిక్ 22 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఎదురైన పరాభవానికి టీ20ల్లో భారత్ బదులు తీర్చుకుంది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి ఆసీస్ వన్డే సిరీస్ సొంతం చేసుకుంటే.. పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీసేన సేమ్ సీన్ రిపీట్ చేసింది.

ధోనీ ముగించినట్లుగానే
మ్యాచ్ అనంతరం ఆసీస్ కోచ్ లాంగర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ఇది అద్భుతమైన మ్యాచ్. హార్దిక్ పాండ్యా బాగా ఆడాడు. అతడు ఎంత ప్రమాదకరమో మాకు తెలుసు. గతంలో ఎంఎస్ ధోనీ మ్యాచ్‌ను ముగించినట్లుగానే ఇప్పుడు హార్దిక్ ఆ పని పూర్తిచేశాడు. ఈ పర్యటనలో అతడు ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఇది ఎంతో ప్రత్యేకం' అని అన్నాడు. భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నప్పటికీ.. హార్దిక్ తానే పూర్తిగా బాధ్యత తీసుకున్నాడు. ధోనీ తరహాలోనే లెక్కలు వేసుకుని మరి బంతులను బాదాడు.

విరాట్ అత్యుత్తమ ప్లేయర్
'మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తుందని ముందే ఊహించాను. మా జట్టు గొప్పగా ఫీల్డింగ్ చేసింది. కానీ భారత ఆటగాళ్లు తమ అనుభవంతో పైచేయి సాధించారు. టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు. శిఖర్ ధావన్ అద్భుతంగా ఆడాడు. విరాట్ కోహ్లీ చక్కని షాట్లతో అలరించాడు. గత కొన్నేళ్లుగా విరాట్ అత్యుత్తమ ప్లేయర్ అని చెబుతూనే ఉన్నాను. ఈ మ్యాచ్‌లో అతడు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు' అని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. 2016లో ఇక్కడే జరిగిన మ్యాచ్‌లో 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. తాజా మ్యాచ్‌లో 195 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసింది. ఆసీస్‌లో ఆస్ట్రేలియాపై ఇవే అత్యధిక ఛేదనలు.

మరో మ్యాచ్ మిగిలుండగానే
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. మాథ్యూ వెడ్ (32 బంతుల్లో 58; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో అలరించగా.. స్టీవ్ స్మిత్ (38 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (36 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే కోహ్లీసేన సిరీస్ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్ సిడ్నీ వేదికగానే మంగళవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ISL 2020: కేరళపై ఘనవిజయం.. గోవా బోణీ!!