
సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అన్నిసార్లు ఔట్ చేయడానికి తన నైపుణ్యంతో పాటు కాస్తంత అదృష్టం కూడా కారణమని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజల్ వుడ్ తెలిపాడు. ఇక ఈ ఆసీస్ పేసర్ ఈ ఏడాది వన్డేల్లో వరుసగా నాలుగు సార్లు ఔట్ చేశాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీని వరుసగా బోల్తాకొట్టించడం అంతు సులవువైన పనికాదు. కానీ హజల్‌వుడ్ వరుసగా అతని వికెట్ తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ వికెట్ తీసినా, టెస్టు సిరీస్‌లో ఔట్ చేయడం అంత తేలిక కాదన్నాడు.
'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాకు కాస్త అదృష్టం ఉంది. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇలా ఉండదు. గతంలో జరిగిన టెస్టుల్లో విరాట్ పరుగులు సాధించాడు. ఇక గులాబి బంతితో జరిగే టెస్టులో కొత్తగా ప్రయత్నించాలి. ప్రారంభంలోనే కోహ్లీ వికెట్ తీయడం చాలా కీలకం. గతంలో జరిగిన ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీని ఔట్ చేశాను. మ్యాచ్‌లో పట్టు సాధించాలంటే అతన్ని తొందరగా పెవిలియన్‌కు చేర్చాలి' అని హజల్‌వుడ్ తెలిపాడు. గత 2018-19 సిరీస్‌లో తమ జట్టు బౌలింగ్ విభాగం ప్రభావం చూపలేకపోయిందని, ఈ సారి మాత్రం సత్తాచాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అంతేగాక, పేసర్ మిచెల్ స్టార్క్ రాకతో తమ బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠంగా మారిందని హజిల్‌వుడ్ స్పష్టం చేశాడు. భారత్‌తో తొలి టీ20 అనంతరం స్టార్క్ వ్యక్తిగత కారణాలతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతను తిరిగి జట్టులో చేరుతున్నాడని ఆదివారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో డే/నైట్ టెస్టులో గొప్ప రికార్డు ఉన్న స్టార్క్ అందుబాటులో ఉండటం తమకు కలిసొచ్చే అంశమని హజల్ వుడ్ చెప్పుకొచ్చాడు. అటాకింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడిచేసే స్టార్క్ జట్టుకు అత్యంత బలమని పేర్కొన్నాడు. స్టార్క్ ఆడిన ఏడు డే/నైట్ టెస్టుల్లో 42 వికెట్లు పడగొట్టాడు. గులాబి బంతితో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా, నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి డే/నైట్ టెస్టు ప్రారంభం కానుంది.