
న్యూఢిల్లీ: సిడ్నీ టెస్ట్‌లో ఓటమి తప్పించుకున్నామనే ఆనందంలో ఉన్న భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరిగే ఆఖరి టెస్ట్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న అతను తదుపరి మ్యాచ్ ఆటం లేదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. అయితే బుమ్రా గైర్హాజరీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఒకవేళ బుమ్రా దూరమైతే భారత్‌కు కష్టాలు తప్పవు. ఇప్పటికే స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో దూరమవ్వగా.. మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ అనుభంలేని బౌలర్లతో బుమ్రా బౌలింగ్ విభాగాన్ని నడిపించాడు. ఇప్పుడు అతను కూడా దూరమైతే జట్టులో అంతా అనుభవలేమి బౌలర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. పైగా రవీంద్ర జడేజా, హనుమ విహారీ, కేఎల్ రాహుల్‌లు కూడా గాయాల బారిన పడి సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు.
జట్టులో ఉన్న అశ్విన్, పంత్ కూడా స్వల్ప గాయాలతో సతమతమవుతున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో సిరీస్ డిసైడర్ మ్యాచ్ అయిన నాలుగో టెస్ట్‌లో భారత్ ఏమేరకు రాణిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.
బుమ్రా దూరమైతే నటరాజన్ జట్టులోకి రావచ్చు. అతనికిది అరంగేట్ర మ్యాచ్ కాగా.. సిరాజ్, నవ్‌దీప్ సైనీలు కూడా ఈ సిరీస్‌తోనే సంప్రదాయక ఫార్మాట్‌లోకి అడుగుపెట్టారు. ఇక జడేజా స్థానంలో జట్టులోకి వచ్చే శార్దుల్ ఠాకుర్‌కు కూడా అనుభవం లేదు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అతను గాయపడ్డాడు. ఒక రకంగా అతనికి కూడా ఇది అరంగేట్రం అన్నట్లే. ఈ సిరీస్‌లో 29.36 సగటుతో బుమ్రా 11 వికెట్లు తీశాడు. ఇక అతని బౌలింగ్‌లో భారత ఫీల్డర్లు చాలా క్యాచ్‌లు చేజార్చారు. సుమారు 8 క్యాచ్‌లు నేలపాలు చేశారు. బుమ్రా లేకపోతే భారత్ బౌలింగ్ మరింత బలహీనం కానుంది.