
నాగ్‌పూర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. నాగ్‌పూర్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ సిరీస్ కోసం నెట్స్‌లో చెమటోడ్చుతున్నాయి. విజయం కోసం వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా కీలకం. ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌లో టీమిండియా కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాలి. దాంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా విజయమే లక్ష్యంగా సన్నదమవుతోంది.
నాగ్‌పూర్‌లోని విదర్భ మైదానంలో ఆధిక్యం ఎవరిది..? గత గణాంకాలను ఎలా ఉన్నాయనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాదాపు ఐదేళ్ల తర్వాత నాగ్‌పుర్ స్టేడియం మరో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది. చివరిసారిగా 2017 నవంబర్‌లో శ్రీలంకతో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ తేడాతో లంకను ఓడించింది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆరు టెస్టులు జరగగా.. నాలుగు టెస్టుల్లో టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఓటమిపాలవ్వగా.. మరొకటి డ్రాగా ముగిసింది. సౌతాఫ్రికా చేతిలో (2010)నే భారత్‌కు పరాభవం ఎదురైంది. తొలి రెండు రోజులు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండి.. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలించడం నాగ్‌పూర్ పిచ్ ప్రత్యేకత.
విదర్భ స్టేడియం వేదికపై భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య 2008లో తొలి టెస్ట్ జరిగింది. ఇందులో భారత్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (109)తోపాటు సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ అర్ధ శతకాలతో అదరగొట్టేశారు. భారత స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (4/64), అమిత్ మిశ్రా (3/27)తోపాటు ఇషాంత్ శర్మ (2/31) రాణించారు.
విదర్భ స్టేడియంలో అత్యధిక స్కోరు: 610/6 డిక్లేర్డ్. శ్రీలంకపై భారత్ చేసిన పరుగులు ఇవీ..
అత్యల్ప స్కోరు: దక్షిణాఫ్రికా 2015/16 సీజన్‌లో భారత్‌పై 79 పరుగులకు ఆలౌట్.
అత్యధిక వ్యక్తిగత స్కోరు: దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 253* పరుగులను భారత్‌పై (2010/11)సాధించాడు.
ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన : భారత్‌పై (2008/2009) ఆసీస్ బౌలర్ జాసన్ క్రెజా 8/215.
అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్: టీమ్‌ఇండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ 357 . ఆ తర్వాత విరాట్ కోహ్లీ 354 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఈ టెస్టులో మరో నాలుగు పరుగులు చేస్తే సెహ్వాగ్‌ను అధిగమించే అవకాశం ఉంది.
అత్యధిక వికెట్ల వీరుడు: రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటి వరకు 19 వికెట్లను పడగొట్టాడు.