India vs Australia: ముగిసిన మూడో రోజు ఆట.. చేతులెత్తేసిన ఆసీస్.. విజయం ముంగిట భారత్

మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ పట్టు బిగించింది. సమష్టిగా చెలరేగి విజయానికి చేరువైంది. మరోసారి భారత బౌలర్లు కలిసి కట్టుగా చెలరేగడంతో ఆస్ట్రేలియా టాపార్డర్ చెతులెత్తేసింది. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 6 వికెట్లకు 133 రన్స్ చేసింది. క్రీజులో ప్యాట్ కమిన్స్(15 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్(17 బ్యాటింగ్) ఉన్నారు.
ఆసీస్ బ్యాటింగ్‌లో మాథ్యూ వేడ్(40), లుబషేన్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, సిరాజ్, బుమ్రా, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతానికి ఆసీస్ కేవలం 2 పరుగుల లీడ్‌లో ఉంది. నాలుగో రోజు ఆటలో మిగిలిన నాలుగు వికెట్లను ఎంత త్వరగా తీస్తే భారత్ విజయం అంత సులువు అవుతోంది. అడిలైడ్ మాదిరి అద్భుతాలు జరిగితే తప్పా ఆసీస్ ఓటమి తప్పించుకోలేదు.

రహానే రనౌట్.. భారత్ ఆలౌట్
277/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 17 పరుగుల వ్యవధిలోనే సెంచరీ హీరో రహానే వికెట్ కోల్పోయింది. లయన్ వేసిన 100వ ఓవర్ చివరి బంతిని జడేజా క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకున్న లబుషేన్ వేగంగా కీపర్‌కు పైన్ అందజేయడంతో అతనే అంతే వేగంగా వికెట్లను కొట్టేయడంతో రహానే నిరాశగా వెనుదిరిగాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది. జడేజా హాఫ్ సెంచరీ చేసినా.. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో 32 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయి ఫస్ట్ ఇన్నింగ్స్‌ను 326 పరుగులకు ముగించింది. భారత్‌కు 131 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

చెలరేగిన భారత బౌలర్లు..
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ జోబర్న్స్(4)ను టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. దాంతో క్రీజులోకి వచ్చిన లబుషేన్‌తో ఓపెనర్ మాథ్యూవేడ్ పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ అశ్విన్ అద్భుత బంతితో లబుషేన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత స్మిత్ కుదురుకునే ప్రయత్నం చేసినా.. బుమ్రా బ్యూటీఫుల్ బాల్‌కు విచిత్రంగా పెవిలియన్ చేరాడు. అతను వేసిన బంతి అనూహ్య రీతిలో లెగ్ స్టంప్ బెయిల్‌ను ముద్దాడుతూ వెళ్లింది. దాంతో స్మిత్(8) నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

1 రన్.. 3 వికెట్స్..
ఇక ట్రావిస్ హెడ్‌తో నిలకడగా ఆడుతున్న మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ వెంటనే ట్రావిస్ హెడ్‌ను సిరాజ్ ఔట్ చేయగా.. టిమ్ పైన్‌ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ట్రావిస్ హెడ్ మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇవ్వగా.. రహానే స్మార్ట్ కెప్టెన్సీతో రివ్యూకెళ్లి పైన్ వికెట్ సాధించాడు. దాంతో ఆసీస్ 1 పరుగు వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

పరువు నిలిపిన గ్రీన్, కమిన్స్..
భారత బౌలర్ల జోరు చూసి.. ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోతుందా? అనిపించింది. కానీ గ్రీన్, కమిన్స్ అద్భుతంగా పోరాడారు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఓపిగ్గా ఆడారు. భారత కెప్టెన్ రహానే బౌలర్లను మారుస్తూ వ్యూహాలు రచించినా ఈ జోడీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అశ్విన్ వేసిన 60వ ఓవర్‌లో కమిన్స్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను పంత్ నేలపాలు చేయడం ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఈ క్యాచ్ కనుక పట్టుంటే భారత్ పని మరింత సులువయ్యేది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కమిన్స్ ఆట ముగిసే వరకు మరింత జాగ్రత్తగా ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications