India vs Australia: ఈ విజయం కుర్రాళ్లదే!

టీమిండియా వెన్నుముక విరాట్ కోహ్లీ లేకున్నా.. సగం జట్టు గాయాలతో దూరమైనా.. బయోబబుల్ వివాదాలు చుట్టుముట్టినా.. జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా.. భారత్ విజయం మాత్రం ఆగలేదు. సమష్టి ప్రదర్శనతో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టికరిపించిన రహానే నేతృత్వంలోని టీమిండియా చారిత్రత్మక విజయాన్నందుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆశలు అడుగంటి వేళ అసాధారణ పోరాట పటిమ చూపెట్టారు. అరంగేట్ర సిరీస్‌లోనే సత్తా చాటి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. 1988 తర్వాత బ్రిస్బేన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించారు.

ఒక్కొక్కరుగా..
టీ20 ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన ఈ యువ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌లో ఇలా రాణిస్తారని ఎవరూ ఊహించలేదు. వీరికి అవకాశాలు కూడా నేరుగా ఏం రాలేదు. సీనియర్ ఆటగాళ్ల గాయాలతోనే వీళ్లంతా ఒక్కొక్కరుగా అవకాశాలు దక్కించుకున్నారు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో సిరాజ్, సిడ్నీ టెస్ట్‌తో నవ్‌దీప్ సైనీ, బ్రిస్బేన్ టెస్ట్‌తో సుందర్, నటరాజన్ అరంగేట్రం చేశారు. శార్దూల్ కూడా ఆఖరి మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకున్నాడు. కానీ ఈ ఐదుగురు అనుభవం లేకున్నా ఆతిథ్య జట్టును వణికించారు. సైనీ ఒక్కడే గాయంతో కొంత ఇబ్బంది పడ్డా.. మిగతా నలుగురు అదరగొట్టారు. అయితే వీరంతా సామన్య కుటుంబాల్లో నుంచి వచ్చినవాళ్లే.

బిడ్డను చూడని నటరాజన్..
ఆస్ట్రేలియా గడ్డపై నెట్‌బౌలర్‌గా అడుగుపెట్టి అనూహ్యంగా అవకాశాలు అందుకున్న నటరాజన్ ఇప్పటి వరకు తన కూతురును చూడలేదు. ఐపీఎల్ ఆడుతుండగానే తండ్రయిన ఈ తమిళనాడు క్రికెటర్.. బయోబబుల్ నిబంధనల కారణంగా ఆసీస్‌లోనే ఉండిపోయాడు. టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత కూడా అతను టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేదు. బ్యాకప్ బౌలర్‌గా జట్టుతోనే ఉండిపోయాడు. చివరి టెస్ట్‌కు అనూహ్యంగా బుమ్రా దూరమవడంతో అవకాశాన్ని అందుకున్నాడు. తద్వారా ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

తండ్రి మరణించినా..
ఇక మహ్మద్ సిరాజ్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే తన తండ్రి మరణించాడు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినా అతను అక్కడే ఉండిపోయాడు. భారత జట్టు తరఫున ఆడాలనే తన తండ్రి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. అభిమానుల నుంచి వివక్ష ఎదురైనా.. సీనియర్ ఆటగాళ్ల గాయాలతో అదనపు బాధ్యతలు మోయాల్సి వచ్చిన సిరాజ్ వెనుకడుగు వేయలేదు. జట్టు కోసం తన తండ్రి కలను సాకారం చేయడం కోసం తీవ్రంగా శ్రమించాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి కెరీర్ బెస్ట్ గణంకాలను అందుకున్నాడు.

శార్దూల్, వాషింగ్టన్..
శార్దూల్, వాషింగ్టన్ సుంధర్‌లు కూడా ఆఖరి టెస్ట్‌లో అదరగొట్టారు. అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా భారత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వీరు కనబర్చిన పోరాట పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును చెరో హాఫ్ సెంచరీతో ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టును రేసులో నిలిపారు. అటు బౌలింగ్‌లోనూ సత్తా చాటారు. తమదైన ఆటతో సీనియర్లు లేని లోటును తీర్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications