
సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌ను డ్రా చేసుకున్న సంతోషంలో ఉన్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఓటమి నుంచి గట్టెక్కించిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారీ తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. చివరి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తుండగా తొడ కండరాల గాయానికి గురైన విహారి.. గబ్బా వేదికగా జరిగే నాలుగో టెస్ట్ ఆడటంపై అనుమానం నెలకొంది. క్రీజులోకి దిగిన ఆరంభంలోనే తొడ కండరాలు పట్టేసినా జట్టు కోసం విహారీ బ్యాటింగ్ కొనసాగించాడు. అధిక మోతాదు పెయిన్ కిల్లర్లను వేసుకొని మరి ఆడాడు.
అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే విహారీని టీమిండియా ఫిజికల్ టీమ్ స్కానింగ్‌కు పంపించింది. ఆ రిపోర్టులు మంగళవారం రానున్నాయి. గాయం తీవ్రమైతే అతను తదుపరి మ్యాచ్ ఆడడు. 'విహారీ తొడకండరాల్లో చీలిక ఉందా? లేదా? అనేది స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాక క్లారిటీ రానుంది. ఒక వేళ గ్రేడ్1 టియర్ ఉంటే మాత్రం అతను నాలుగు వారాలు రిహాబిలిటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే నాలుగో టెస్టే కాదు.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌లకు కూడా దూరమవుతాడు'అని టీమ్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.
ఈ మ్యాచ్‌లో బొటన వేలు విరగడంతో రవీంద్ర జడేజా ఆసీస్ పర్యటన నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. విహారీ దూరమైతే స్పెషలిస్ట్ కీపర్‌గా సాహా జట్టులోకి రానున్నాడు. అదే జరిగితే పంత్‌ను బ్యాట్స్‌మెన్‌గా పరిగణించనున్నారు. లేకుంటే పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌కు మరో అవకాశం ఇవ్వనున్నారు.
ఇక ఆసీస్ పర్యటనలో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాలతోనే జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో విహారి, జడేజా చేరారు.