
ఓపెనర్లు విఫలం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకముందే ఓపెనర్ వికెట్ చేజార్చుకుంది. ప్రాక్టీస్ మ్యాచులోనే విఫలమైన యువ ఓపెనర్ పృథ్వీ షా (0) మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రెండు బౌండరీలు బాదిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (17; 40 బంతుల్లో 2×4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. జట్టు స్కోరు 32 వద్ద పాట్ కమిన్స్ వేసిన 18.1వ బంతికి పెవిలియన్ చేరాడు. అయితే చటేశ్వర్ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు అతడు 32 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

లయన్‌కు చుక్కలు చూపించిన పుజారా
ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన సమయంలో విరాట్ కోహ్లీతో కలిసిన పుజారా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. డిఫెన్స్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ నాథన్ లయన్‌కు చుక్కలు చూపించాడు. సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలో విరాట్‌తో కలిసి పుజారా మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో 49.3 ఓవర్లకు భారత్ 100/2 పరుగులు చేసింది. అయితే లయన్ వేసిన ఆ తర్వాతి బంతికే పుజారా వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఔటివ్వకపోవడంతో ఆసీస్ సమీక్షకు వెళ్లి విజయవంతం అయింది. ఆపై 107/3 వద్ద భారత్ టీ విరామానికి వెళ్లింది.

కోహ్లీ అర్ధ శతకం
తొలి రెండు సెషన్లలో ఆచితూచి ఆడిన భారత్.. మూడో సెషన్లో కాస్త వేగం పెంచింది. బంతి పాతబడటంతో కోహ్లీ, రహానె కొన్ని బౌండరీలు బాదారు. అయితే చెత్త బంతులకు మాత్రమే పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 123 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం సాధించాడు. రహానే చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 168 బంతుల్లో 88 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించి జట్టు స్కోరును 150 దాటించారు. స్కోరుబోర్డు వేగం అందుకునే సమయంలో కోహ్లీ రనౌట్ అయ్యాడు. రహానె అనవసర పరుగుకు ప్రయత్నించడంతో కోహ్లీ పెవిలియన్ చేరాడు.

విహారి ఫ్లాఫ్ షో
మరికాసేపటికే అర్ధ శతకానికి చేరువైన రహానె సైతం స్టార్క్ వేసిన బంతికి ఎల్బీగా ఔట్ అయ్యాడు. ఆదుకుంటాడని అనుకున్న తెలుగు తేజం హనుమ విహారి (16; 25 బంతుల్లో 2×4)ని హేజిల్‌వుడ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.ఆ తర్వాత నైట్ వాచ్‌మన్ రవిచంద్రన్ అశ్విన్ (15; 17 బంతుల్లో 1×4), కీపర్ వృద్ధిమాన్ సాహా (9; 25 బంతుల్లో 1×4) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు భారత్ 89 ఓవర్లలో 233/6తో నిలిచింది. రెండో రోజు భారత్ 250 పరుగులకు పైగా చేస్తే బౌలర్లకు పోరాడే అవకాశం ఉంటుంది.
145 బంతుల్లో ఒక్క బౌండరీ లేదు.. టెస్ట్ క్రికెట్ అంటే ఏంటో చూపించిన నయా వాల్!!


Click it and Unblock the Notifications












