India vs Australia: కొంపముంచిన హర్షల్ పటేల్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్!

మొహాలీ: టీ20 ప్రపంచకప్ ముందు సన్నాహకంగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు చుక్కెదురైంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో ఓటమిపాలైంది. అసాధారణ బ్యాటింగ్‌తో ఆసీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్) చెలరేగగా.. కేఎల్ రాహుల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్ రెండు, జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

చెలరేగిన గ్రీన్
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కామెరూన్ గ్రీన్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడగా.. మాథ్యూవేడ్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. చాహల్‌కు ఓ వికెట్ దక్కింది. ఇక విజయంపై పట్టు బిగించిన సమయంలో హర్షల్ పటేల్ క్యాచ్ నేలపాలు చేయడంతో పాటు ధారళంగా పరుగులివ్వడం టీమిండియా కొంపముంచింది.

విధ్వంసకర ఆరంభం..
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఆరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్ శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. ఆరోన్ ఫించ్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేసినా.. మరో ఓపెనర్ కామెరూన్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత గ్రీన్ అదే జోరు కనబర్చగా.. క్రీజులోకి వచ్చిన స్మిత్ ఆచితూచి ఆడాడు. అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ పటేల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ నేలపాలు చేయగా.. ఆ వెంటనే గ్రీన్ సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఉమేశ్ యాదవ్ దెబ్బతీసినా..
డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్‌లో గ్రీన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగాడు. అనంతరం ఉమేశ్ యాదవ్ ఒకే ఓవర్‌లో స్మిత్, మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్ చేర్చి ఆసీస్‌ను దెబ్బతీసాడు. అయితే ఈ రెండు వికెట్లను టీమిండియా రివ్యూల ద్వారా సాధించడం విశేషం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లీస్(17) కూడా విఫలమయ్యాడు. కానీ టీమ్ డేవిడ్ మాత్రం ధాటిగా ఆడుతూ ఆస్ట్రేలియాను విజయం దిశగా నడిపించాడు. ఇక హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.

కొంపముంచిన హర్షల్..
ఈ ఓవర్‌లో టీమ్ డేవిడ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను హర్షల్ పటేల్ అందుకోలేకపోయాడు. దాంతో చెలరేగిన టీమ్ డేవిడ్ 22 రన్స్ పిండుకున్నాడు. దాంతో మ్యాచ్ ఆసీస్ వైపు మళ్లింది. భువీ సైతం 16 పరుగులు ఇవ్వడంతో.. ఆఖరి ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే చాహల్ తన తొలి బంతికే టీమ్ డేవిడ్‌ను ఔట్ చేసినా.. కమిన్స్ బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications