
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సిండే టెస్ట్‌లో టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే(197 బంతుల్లో 100 బ్యాటింగ్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 61/2 స్థితిలో క్రీజులోకి వచ్చి రహానే.. టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా(17) త్వరగానే ఔటైనా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
హనుమ విహారీ(21)తో కలిసి నాలుగో వికెట్‌కు 52 రన్స్, యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్(29)తో ఐదో వికెట్‌కు 57 పరుగుల విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి జడేజాతో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 111 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే.. జడేజా సాయంతో తన క్లాసిక్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీ.. మంచి బంతులను గౌరవిస్తూ వీలుచిక్కిన వాటిని బౌండరీలకు తరలించింది. ఇక కొత్త బంతి అందుకున్న ఆసీస్‌కు.. 73 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రహానే స్లిప్ క్యాచ్ ఇవ్వగా.. స్టీవ్ స్మిత్ నేలపాలు చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో సునాయస క్యాచ్‌ను చేజార్చి మంచి అవకాశాన్ని వృథా చేశాడు. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న రహానే.. మరింత జాగ్రత్తగా ఆడుతూ విలువైన సెంచరీ సాధించాడు.
కమిన్స్ వేసిన 87వ ఓవర్ నాలుగో బంతిని బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా బౌండరీ రాబట్టి టెస్ట్‌ల్లో 12వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చాలా నిరాడంబరంగా సెంచరీ సెలెబ్రేట్ చేసుకున్నాడు. అడిలైడ్ ఘోర పరాజయం తర్వాత అది విరాట్ కోహ్లీ లేని ఒత్తిడిలో సాధించిన ఈ సెంచరీ అతనికి ప్రత్యేకంగా నిలవనుంది. రహానే చివరిసారిగా 2017లో శ్రీలంకపై సెంచరీ చేయగా.. ఆస్ట్రేలియాపై 2014లో సాధించాడు.