
సిడ్నీ: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముంగిట సిడ్నీ క్రికెట్ మైదానంలో టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. మంగళవారం అజింక్యా రహానే సారథ్యంలోని భారత ఆటగాళ్లు పూర్తిస్థాయి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను టీమ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ వేదికగా పంచుకుంది.
ఈ ఫొటోల్లో రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ వామప్ చేస్తుండగా.. హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ నెట్స్‌లో చెమటోడ్చాడు. కెప్టెన్ రహానేతో పాటు ఇతర ఆటగాళ్లు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా 1-1తో సమంగా ఉన్నాయి. స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ జట్టులో చేరడంతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే రోహిత్ రాకతో విహారి, మయాంక్‌లలో ఒకరు చోటు కోల్పోయే అవకాశం ఉంది. సిరీస్ సమం కావడంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గురువారం నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుండగా.. 25 శాతం మంది అభిమానులను అనుమతించనున్నారు.