
ఆరంభం అదరింది..
195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు కేఎల్ రాహుల్(30), శిఖర్ ధావన్ శుభారంభాన్ని అందించారు. ఆరంభంలో నిదానంగా ఆడిన ఈ జోడీ ఆ తర్వాత జోరు పెంచింది. ఆండ్రూ టై వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి రాహుల్ భారీ సిక్సర్ కొట్టగా.. చివరి బంతిని ధావన్ బౌండరీకి తరలించాడు. మ్యాక్స్‌వెల్ మరుసటి ఓవర్‌లో రాహుల్ ఫోర్ కొట్టగా.. ధావన్ సిక్స్, ఫోర్‌తో చెలరేగడంతో ఆ ఓవర్‌లో 19 రన్స్ వచ్చాయి. అబాట్ బౌలింగ్‌లో కూడా రాహుల్, ధావన్ చెరొక బౌండరీ రాబట్టడంతో టీమిండియా 5 ఓవర్లలోనే 56 పరుగులు చేసింది. కానీ ఆండ్రూ టై వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దాంతో ఫస్ట్ వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

గబ్బర్ హాఫ్ సెంచరీ..
అనంతరం క్రీజులోకి కోహ్లీ రాగా.. ధావన్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో గబ్బర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అప్పటి వరకు నిదానంగా ఆడిన కోహ్లీ గేర్ మార్చాడు. జంపా బౌలింగ్‌లో స్టెప్ ఔటై భారీ సిక్సర్ కొట్టాడు. అనంతరం శాంసన్ కూడా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. అయితే అదే దూకుడలో స్వెప్సన్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడబోయిన శాంసన్(15) లాంగాఫ్‌లో స్మిత్‌కు చిక్కి వెనుదిరిగాడు.

చెలరేగిన కోహ్లీ..
అయినా మరోవైపు కోహ్లీ ధాటిగా ఆడాడు. ఆండ్రూ టై బౌలింగ్‌లో ఫోర్, సిక్స్, ఫోర్ బాది 18 పరుగులు పిండుకున్నాడు. విరాట్ ఆడిన స్కూప్ షాట్ అయితే ఇన్నింగ్సేకే హైలైట్‌గా నిలిచింది. ఇక జోరు మీదున్న కోహ్లీని ఆడమ్ సామ్స్ ఔట్ చేశాడు. అతను వేసిన వైడ్ బాల్‌ను స్టెప్ ఔట్ అయి ఆడబోయిన కోహ్లీ(40) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 18 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి రాగా.. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడి సునాయసంగా లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. రెండు భారీ సిక్సర్లు కొట్టిన పాండ్యా సునాయస విజయాన్నందించాడు.


Click it and Unblock the Notifications
