
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్ తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. పెటర్నిటీ లీవ్ మీద టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు రానుండగా.. తాత్కలిక సారథిగా అజింక్యా రహానే జట్టును నడిపించనున్నాడు. ఇక విరాట్ కోహ్లీ మంగళవారం స్వదేశానికి బయల్దేరనున్నాడు. ఈ సందర్భంగా అతను జట్టు సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడాడు. మిగతా సిరీస్‌లో అనుసరించిన వ్యహాలపై, విజయానికి ఉన్న మార్గాలపై ఆటగాళ్లతో చర్చించినట్లు సమాచారం.
టీమిండియా ఆటగాళ్లు సోమవారం ప్రాక్టీస్ చేయలేదు. అడిలైడ్ ఓవల్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేశారు. కంకషన్‌కు గురైన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పురోగతిని టీమ్‌మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. బాక్సింగ్ డే టెస్టులోపు అతను కోలుకుంటాడని ఆశిస్తోంది. ఒకవేళ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తే హనుమ విహారి స్థానంలో జడేజా తుది జట్టులోకి రానున్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచులో జడ్డూ తలకు బంతి తగలడంతో పాటు తొడ కండరాల గాయంతోనూ ఇబ్బంది పడ్డాడు. దాంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అతను మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్ ఆడాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లు, ఫస్ట్ టెస్ట్‌కు జడేజా దూరమయ్యాడు. కానీ ఫస్ట్ టెస్టు ఆడుతున్నప్పుడు అతను నెట్స్‌లో సాధన చేయడం కనిపించింది. ప్రస్తుతానికి అతడు వేగంగా కోలుకుంటున్నాడు. అయితే 100 శాతం ఫిట్‌నెస్ సాధించాడో లేదో తెలియదు. ఒకవేళ సాధిస్తే మాత్రం హనుమ విహారికి చోటు దక్కదని సమాచారం. ఇక సిడ్నీ టెస్టుకు ముందు రోహిత్ శర్మ సాధన మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం అతడు సిడ్నీలోని రెండు గదుల భవంతిలో కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్ అయ్యాడు.