India vs Australia: ఫస్ట్ వన్డేకు ‘స్టాప్ అదానీ’ ఉద్యమ సెగ.. మైదానంలోకి దూసుకొచ్చిన ఆందోళనకారులు! (వీడియో)

సిడ్నీ: తొమ్మిది నెలల కరోనా బ్రేక్ అనంతరం టీమిండియా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించింది. సిడ్నీ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను అనుమతించారు. కరోనా అనంతరం ప్రేక్షకుల సమక్షంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. అయితే పర్యావరణ ప్రేమికులు కొంత మంది ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగించారు. సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చారు. '1 బిలియన్ డాలర్ అదానీ రుణం వద్దు'అనే ప్లకార్డులతో తమ నిరసనను తెలియజేచేశారు.
మైదానంలోకి దూసుకొచ్చి..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఇద్దరు ప్రేక్షకులు సెక్యూరిటీని దాటుకుంటూ మైదానంలోకి పరుగెత్తారు. పిచ్ వైపు దూసుకెళ్లి ‘1 బిలియన్ డాలర్ అదానీ రుణం వద్దు'అనే ప్లకార్డును ప్రదర్శించారు. దాంతో అసలేం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వారిని వెనక్కి పంపించారు. కానీ ఆ ఇద్దరిలో ఒక ఆందోళనకారుడు ప్రతిఘటించడంతో బలవంతంగా లాక్కెలాల్సి వచ్చింది. మ్యాచ్ జరుగుతున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వెలుపల కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు స్టాప్ అదానీ అంటూ ఆందోళన చేపట్టారు.

ఇంతకీ విషయం ఏంటంటే..?
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీ ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల తవ్వకం కోసం ఎస్‌బీఐ నుంచి 1 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల రుణాన్ని (రూ.5 వేల కోట్లు) తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సంస్థ పేరును బ్రావుస్ మైనింగ్ అండ్ రిసోర్సెస్‌గా మార్చారు. పర్యావరణాన్ని కలుషితం చేసే బొగ్గు తవ్వకాల కోసం భారతీయుల కష్టార్జితాన్ని రుణంగా ఇవ్వొద్దని ఆస్ట్రేలియన్లు ఎస్‌బీఐని కోరుతున్నారు. అదాని సిరామికల్ మైన్‌కు వ్యతిరేకంగా పర్యావరణ ప్రేమికులు ‘స్టాప్ అదానీ' ఉద్యమాన్ని ప్రారంభించారు.

బౌలర్లకు చుక్కలే..
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ఆరోన్ ఫించ్ ( 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్‌లతో 114), స్టీవ్ స్మిత్ (66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (76 బంతుల్లో 6ఫోర్లతో 69) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక చివర్లో గ్లెన్ మాక్స్‌వెల్ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) వీర విహారం చేయడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ (3/59) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు. కానీ పరుగులను నియంత్రించడంలో విఫలమయ్యారు. చాహల్ 89 పరుగులివ్వగా.. సైనీ 83 రన్స్ సమర్పించుకున్నాడు. బుమ్రా కూడా 73 పరుగులిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications