India vs Afghanistan T20 WC: అయ్యో కోహ్లీసేనకు ఎంతటి కష్టం.. పసికూన అఫ్గాన్‌తోనూ అగ్నీ పరీక్షే!

అబుదాబి: రెండు పెద్ద జట్లపై నిరాశాజనక పెర్ఫామెన్స్‌తో నాకౌట్ ఆశలను క్లిష్టం చేసుకున్న భారత్ .. టీ20 ప్రపంచకప్‌లో పసికూనలతో పోరుకు సిద్దమైంది. నేటి(బుధవారం) సాయంత్రం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత్ టోర్నీలో ఇంకా బోణీ చేయకపోగా... అఫ్గాన్ టీమ్ తమకంటే బలహీనమైన నమీబియా, స్కాట్లాండ్‌లపై ఘన విజయాలు సాధించి గ్రూప్ టాపర్ పాకిస్తాన్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సమరం జరగవచ్చు. పేలవ ప్రదర్శనతో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో పరాజయంపాలైన భారత్.. అన్ని విభాగాల్లోనూ గణనీయంగా మెరుగుపడాల్సివుంది. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్‌ను ఓడిస్తుందా? అనేది కూడా సందేహంగా మారింది.

అశ్విన్‌కు అవకాశ దక్కెనా?
కెప్టెన్‌గా కోహ్లీకిది పరీక్ష కాలమే. పదే పదే రవిచంద్రన్ అశ్విన్‌ను విస్మరిస్తుండడంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో అతడు ఎలాంటి తుది జట్టును ఎంచుకుంటాడన్నది ఆసక్తికరం. ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లోనూ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అప్పటి నుంచి కోహ్లీ, అశ్విన్ మధ్య బేధాభిప్రాయాలున్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా అశ్విన్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం కోహ్లీ ఇష్టం లేదనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ప్రస్తుతం భారత జట్టు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. అఫ్గాన్ బ్యాట్స్‌మెన్‌కు అశ్విన్‌ను ఎదుర్కొన్న అనుభవం లేని నేపథ్యంలో.. అతణ్ని ఆడించే అవకాశాన్ని జట్టు పరిశీలించనుంది. అయితే కోహ్లి మరోసారి అశ్విన్‌ను పక్కన పెడితే.. అతడి పట్ల కోహ్లి వైఖరిపై చర్చ తీవ్రమయ్యే అవకాశముంది. ఒకవేళ వస్తే.. వరుణ్ చక్రవర్తి బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు..
అయితే గత మ్యాచ్‌లో ఆడించిన జట్టునే కొనసాగించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇక బ్యాటింగ్‌లో రోహిత్ తిరిగి ఓపెనింగ్‌కు రావడం లాంఛనమే. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన అతను.. విఫలమైన సంగతి తెలిసిందే. వెన్ను నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. అతను కోలుకుంటే ఇషాన్ కిషన్ బెంచ్‌కు పరిమితమవుతాడు. లేదంటే మరో అవకాశం దక్కొచ్చు. అతను రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు. అప్పుడు రాహుల్.. సూర్య స్థానంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. కోహ్లీతో పాటు భారత బ్యాట్స్‌మెనంతా ఫామ్‌లోకి రావడం భారత్‌కు చాలా అవసరం. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమీ ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపించాలని జట్టు ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌తోనైనా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫామ్‌ను అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరం. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే పెద్దగా సంబరాలేమీ ఉండవు. పొరపాటున ఓడితే మాత్రం విమర్శలు వెల్లువ తప్పదు.

పటిష్టంగా అఫ్గాన్..
అఫ్గానిస్థాన్‌పై టి20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్ రెండుసార్లూ గెలుపొందింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది. ఒక ఓవర్ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టీ20ల్లో అఫ్గాన్ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది. ఈ టోర్నీలో కూడా ఆసిఫ్ అలీ అనూహ్యంగా చెలరేగి ఉండకపోతే పాక్‌పై కూడా అఫ్గాన్ గెలిచేదేమో! కాబట్టి టీమ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఒకవైపు వికెట్లు పడినా, మరోవైపు ఆత్మరక్షణలో పడకుండా ధాటిగా ఆడుతూ చకచకా పరుగులు సాధించగల బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నారు. ఓపెనర్లు హజ్రతుల్లా, షహజాద్ ప్రతీసారి శుభారంభాలు అందించారు. కెప్టెన్ నబీకి భారీ షాట్లు ఆడగల నైపుణ్యం ఉంది. అఫ్గాన్ టీమ్‌కు కూడా యూఏఈ వేదికలపై మంచి అనుభవం ఉంది. అన్నింటికి మించి టీమ్‌లో స్పిన్నర్ల 12 ఓవర్లు మ్యాచ్‌ను శాసిస్తాయి. రషీద్ ఖాన్, నబీ, ముజీబ్‌లు సత్తా చాటితే భారత బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. మొత్తంగా ఈ టీమ్ అంటే తేలికభావం చూపించకుండా భారత్ ఆడాల్సి ఉంది.

పిచ్ రిపోర్ట్..
అబుదాబిలో ఇప్పటివరకు జరిగిన ఎనిమిది టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఆరు సార్లు చేజింగ్ టీమ్ గెలిచింది. టాస్ గెలిస్తే కోహ్లి ఫీల్డింగే ఎంచుకుంటాడనడంలో సందేహం లేదు. తొలి రెండు మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడిన భారత్.. ఇప్పుడు అబుదాబిలో ఎలా ఆడుతుందో చూడాలి. ఈ వేదికలో 2021లో స్పిన్నర్ల (76 మ్యాచ్‌ల్లో 128 వికెట్లు, ఎకానమీ 7.6) కన్నా ఫాస్టబౌలర్లే (76 మ్యాచ్‌ల్లో 308 వికెట్లు. ఎకానమీ 8) మెరుగైన ప్రదర్శన చేశారు.

తుది జట్లు (అంచనా)
భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్/సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
అఫ్గానిస్థాన్: మహమ్మద్ నబీ (కెప్టెన్), హజ్రతుల్లా, షహజాద్, రహ్మానుల్లా, హష్మతుల్లా/ఉస్మాన్, నజీబుల్లా, గుల్బదిన్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్, హసన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications