సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పంజాబ్ ఆటగాడు జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఐదు టీ20ల సిరీస్ కోసం ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సిరీస్ నుంచి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సత్తా చాటిన ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు.

ఈ పర్యటనలో శుభ్‌మన్ గిల్ భారత జట్టును నడిపించనున్నాడు. అభిషేక్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్ ఈ పర్యటనకు ఎంపికైన వారిలో ఉన్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో అభిషేక్ శర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పవర్ ప్లేలో పరుగుల మోత మోగించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ స్కోర్లు నమోదు చేయడంలో అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. అతని పవర్ హిట్టింగ్‌కు ఫిదా అయిన సెలెక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటనలోనూ అతను అదే జోరు కొనసాగిస్తే అభిషేక్ శర్మ టీమిండియాకు రెగ్యులర్ ఓపెనర్‌గా మారే అవకాశం ఉంది.
జింబాబ్వే పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్‌గా ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించే అవకాశం ఉంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ఈ టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిన బీసీసీఐ.. గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే వీవీఎస్ లక్ష్మణ్ తన సపోర్ట్ స్టాఫ్ సాయంతో జింబాబ్వే పర్యటనకు వెళ్తాడని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అభిషేక్ శర్మకు తిరుగుండదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా అభిషేక్ శర్మను జట్టులోకి తీసుకుందే వీవీఎస్ లక్ష్మణ్. అతనే కోచ్ అయితే తుది జట్టులో అభిషేక్ శర్మ చోటు దక్కుతుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్‌ల్లో 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉండగా.. స్ట్రైక్‌రేట్ 204.22 ఉండటం విశేషం. జూలై 6 నుంచి 14 వరకు జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 జూలై6న, రెండో టీ20 జూలై 7న, మూడో టీ20 జూలై 10న, నాలుగో టీ20 జూలై 13న, ఐదో టీ20 జూలై 14న జరగనుంది.
జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.