
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు క్వారంటైన్ పూర్తి చేసుకొని సన్నాహకాలు ప్రారంభించింది. ఈ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోని టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ జట్టును శ్రీలంకకు పంపించింది. ఐపీఎల్, భారత్ ఏ తరఫున సత్తా చాటిన ఆటగాళ్లను ఈ టూర్‌కు ఎంపిక చేసింది. కరోనాతో సావాసం చేస్తూ క్రికెట్ ఆడటం కష్టంగా మారిన తరుణంలో ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ ఈ ప్రయోగానికి తెరలేపింది. ఈ టూర్ సక్సెస్‌ఫుల్‌గా ముగిస్తే భవిష్యత్తులోనూ ఒకేసారి రెండు జట్లను బీసీసీఐ ఆడించనుంది.
ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన భారత సెలెక్షన్ కమిటీ ఐదుగురిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. కోహ్లీసేన తరహాలోనే శ్రీలంకకు బయల్దేరే ముందే ముంబైలో 15 రోజుల క్వారంటైన్‌లో ఉంచి పంపించింది. అక్కడ మరో మూడు రోజులు క్వారంటైన్‌లో ఉన్న ధావన్ సేన సన్నాహకాలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలోనే సోమవారం రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. కెప్టెన్ శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్‌లు రెండు జట్లుగా విడిపోయి ఈ సన్నాహక మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐతో పాటు శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాయి. అయితే స్కోర్ బోర్డు వివరాలను మాత్రం ప్రకటించలేదు.
ఈ ఫొటోల్లో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, మనీష్ పాండే బ్యాటింగ్ చేస్తుండగా.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా ఉండగా.. దేవదత్ పడిక్కల్, పృథ్వీ షా ఫీల్డింగ్ చేస్తూ కనిపించారు. కొంతమంది అభిమానుల కామెంట్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్(47) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. రుతురాజ్ గైక్వాడ్ (63), మనీష్ పాండే(51) అర్థశతకాలు బాదినట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ కుమార్‌కు రెండు వికెట్ల దక్కాయని సమాచారం.