India Tour Of South Africa: ఆ ముగ్గురికి ఇదే లాస్ట్ చాన్స్! ఆడకుంటే కెరీర్ ఖేల్ ఖతమ్!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో టీ20, టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. సౌతాఫ్రికా పర్యటనకు సిద్దమవుతుంది. డిసెంబర్ 26 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో సౌతాఫ్రికాతో భారత్ 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనుంది. నాలుగు టీ20ల సిరీస్‌ను కూడా షెడ్యూల్ చేసినప్పటికీ కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో టీ20 సిరీస్‌ను వాయిదా వేసారు. ముందుగా మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం 18 మంది ప్లేయర్లతో కూడిన జట్టును చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం ఎంపిక చేసింది. ఊహించినట్టే వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానేపై వేటు వేసి రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు ఇచ్చింది. అయితే ఫామ్ కోల్పోయినప్పటికీ రహానెతో పాటు పుజారా, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు చివరి చాన్స్‌గా టీమ్‌తో కొనసాగించింది.

వేలాడుతున్న కత్తి..
గత కొంతకాలంగా విఫలమవుతున్న అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాతో పాటు ఇషాంత్ శర్మకు ఈ సిరీస్ చివరి చాన్స్ అని చెప్పవచ్చు. ఈసారి గనుక వీళ్లు రాణించకపోతే.. వారి కెరీర్‌లకు ఎండ్ కార్డ్ పడినట్లే. పేలవ పామ్‌తోనే వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రహానే మెడపై కత్తి వేలాడుతుంది. కేవలం విదేశాల్లో మెరుగైన రికార్డు ఉందనే కారణంతోనే అతన్ని ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. చతేశ్వర్ పుజారాది కూడా దాదాపు ఇదే పరిస్థితి. గత మూడేళ్లుగా అతను మూడెంకల స్కోర్ అందుకోలేదు. మరోవైపు యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, సూర్యకుమార్ యాదవ్ వంటి కుర్రాళ్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

యువ ఆటగాళ్ల నుంచి పోటీ..
ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాది తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఆ పెర్ఫామెన్స్‌తోనే సఫారీ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇక తుది జట్టులో చోటు కోసం రహానేతో పోటీపడుతున్నాడు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అయిన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలో ఒక్కరే తుది జట్టులో ఆడే పరిస్థితి నెలకొంది. పుజారా సైతం ఈ సిరీస్‌లో రాణించాల్సిందే. అనుభవం దృష్ట్యా ఆరంభ మ్యాచ్‌ల్లో వీరికి చోటు దక్కనుంది. ఇక టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు సౌతాఫ్రికా పర్యటనే చివరిదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

ఇషాంత్‌కు చివరి చాన్స్..
తుది జట్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం కూడా చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 105 టెస్ట్‌లు ఆడిన ఇషాంత్‌కు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌ల రూపంలో పోటీ ఎదురవుతుంది. 'భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానే తొలగింపు ఇషాంత్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక వంటిది. సీనియర్ ఆటగాడిగా ఇషాంత్ మరింత రాణించాలి. చతేశ్వర్ పుజారా విషయంలో కూడా ఇదే నిజం. పుజారా చాలా కాలంగా జట్టులో ఉన్నాడు. అతను ప్రస్తుతం ఫామ్‌లో లేడు. కానీ ఒక సీనియర్ ఆటగాడిగా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని జట్టు ఆశిస్తోంది. ఒకవేళ వారు ఈ సిరీస్‌లో అద్బుతంగా రాణిస్తే, తమ టెస్ట్ కెరీర్‌ను పొడిగించుకోగలరు'అని బీసీసీఐ అధికారి ఒకరు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు.

భారత టెస్ట్ జట్టు :
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications