ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టును ఫైనల్‌తో సహా మూడు సార్లు చిత్తు చేసిన టీమిండియా విజేతగా నిలిచింది. ఓటమెరుగని జట్టుగా టైటిల్ కైవసం చేసుకుంది. 41 ఏళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి భారత్, పాకిస్థాన్ ఫైనల్లో తలపడగా.. సూర్యసేననే విజయం వరిచింది. ఈ గెలుపుతో 9వ సారి ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది.
ఏడు సార్లు వన్డే టోర్నీల్లో గెలిచిన టీమిండియా.. రెండు సార్లు టీ20 టైటిళ్లను అందుకుంది. రెండు వారాల వ్యవధిలోనే పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించిన భారత్.. మరోసారి ఆ జట్టుతో తలపడేందుకు సిద్దమైంది. ఐదు రోజుల వ్యవధిలోనే ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈసారి మహిళల టీమ్ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా అక్టోబర్ 5(ఆదివారం)న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్ సుముఖంగా లేకపోవడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒప్పందం ప్రకారం తటస్థ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్, ఫైనల్ చేరితే.. ఈ మ్యాచ్‌లు కూడా శ్రీలంక వేదికగానే జరగనున్నాయి.
సెప్టెంబర్ 30న గువహతి వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుంది. పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్ అక్టోబర్ 2న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. లీగ్ దశలో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక, పాకిస్థాన్ తర్వాత సౌతాఫ్రికాతో అక్టోబర్ 9న వైజాగ్ వేదికగా మూడో మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 12న ఆస్ట్రేలియా, అక్టోబర్ 19న ఇంగ్లండ్, అక్టోబర్ 23న న్యూజిలాండ్, అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుంది. అక్టోబర్ 29, 30న సెమీఫైనల్స్ జరగనుండగా.. నవంబర్ 2న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగియనుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్-కెప్టెన్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్టిక భాటియా, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్.