ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మూడు వారాల క్రితం టీమిండియా పరిస్థితి అగమ్యగోచరంగా కనిపించింది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా ఘోర పరాజయాలను ఎదుర్కొంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి వన్డే సిరీస్‌లోనే టీమిండియా ఖంగుతిన్నది. పసికూన శ్రీలంక చేతిలో 0-2తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో టీమిండియా ఖంగుతిన్నది.
ఘోర పరాజయాలతో..
ఆ తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 3-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం ఇదే తొలిసారి. 2012-13లో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం సొంతగడ్డపై టీమిండియాకు ఓటమన్నదే లేదు. పుష్కరకాలం పాటు సొంతగడ్డపై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో మాత్రం అనూహ్యంగా ఖంగుతిన్నది. పటిష్టమైన జట్లను మట్టికరిపించిన టీమిండియా.. కివీస్ చేతిలో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది.

దారుణంగా విఫలమైన కోహ్లీ, రోహిత్..
అనంతరం ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించిన టీమిండియా.. ఆ తర్వాతి నాలుగు టెస్ట్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో ఓడి 3-1తో సిరీస్ కోల్పోయింది. ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. డబ్ల్యూటీసీ ప్రారంభమైన తర్వాత వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరిన భారత్.. ఈ సారి మాత్రం అర్హత సాధించలేకపోయింది. ముఖ్యంగా ఈ సిరీస్‌ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. దాంతో వారిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్ కూడా వచ్చింది.
అంచనాలు తగ్గిన స్థితిలో..
ఈ వరుస పరాజయాలతో టీమిండియాపై అభిమానుల్లో అంచనాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్ ప్రారంభమవ్వగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌తోనే మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చి ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వన్డే సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది.
ఫామ్‌లోకి స్టార్ ఆటగాళ్లు..
జట్టులో స్థానం ప్రశ్నార్థకమైన స్థితిలో శ్రేయస్ అయ్యర్ దుమ్మురేపాడు. శుభ్‌మన్ గిల్ ఫామ్ అందుకున్నాడు. 16 నెలల తర్వాత వన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఆఖరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసి కోహ్లీ టచ్‌లోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో భారత పేస్ విభాగం పటిష్టంగా ఉంది. స్పిన్నర్లు జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించారు.
పటిష్టంగా బౌలింగ్ లైనప్..
వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్ వంటి మేటీ జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం టీమిండియా ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందడనంలో సందేహం లేదు.
బుమ్రా లేకపోవడమే..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు ఉన్న ఏకైక లోటు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడం. వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన బుమ్రా.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 32 వికెట్లతో సత్తా చాటాడు. జట్టు మొత్తం విఫలమైన వేళ ఒక్కడే సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఆఖరి టెస్ట్‌లో అతను బౌలింగ్ చేసి ఉంటే టీమిండియా ఈ సిరీస్‌ను సమం చేసుకునేది. అంతలా ప్రభావం చూపాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయంలోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో ఆశలు లేని స్థితిలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బుమ్రా లేకపోవడం 30 శాతం మేర భారత అవకాశాలను తగ్గిస్తుందని వ్యాఖ్యాత రవిశాస్త్రి చెప్పడంలో అతిశయోక్తి లేదు.