హైదరాబాద్: టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అజింక్యా రహానే అనూహ్య రీతిలో చెలరేగుతున్నాడు. పేలవ ఆటతీరుతో టీమిండియాలో చోటు కోల్పోయిన రహానే తన ఆటతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో రహానేను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోకపోగా.. చెన్నై రూ.50 లక్షల కనీస ధరకు తీసుకొంది.
బ్యాకప్ ప్లేయర్‌గా ఉంటాడని భావించింది. ఆ వ్యూహంలో భాగంగానే ఆరంభ మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వలేదు. కానీ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయంతో జట్టుకు దూరమవడంతో ముంబై ఇండియన్స్‌తో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన రహానే.. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) పరుగులతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ ఇన్నింగ్స్‌తో తుది జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్న రహానే.. రాజస్థాన్ రాయల్స్‌పై 19 బంతుల్లో 31, ఆర్‌సీబీపై 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 9 పరుగులే చేసి విఫలమైనా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 71 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో రహానే ఆడిన స్వీప్, రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లు క్రికెట్ అభిమానులను కనువిందు చేశాయి. దాంతో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో రహానేదే అత్యధిక స్ట్రైక్ రేట్ కావడం విశేషం. ఈ సూపర్ బ్యాటింగ్‌తో రహానే మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వేదికగా జూన్ 7 నుంచి జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను రహానే ఆడే అవకాశాలున్నాయి.
శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయంతో జట్టుకు దూరమవడం, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రహానేకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే రహానే, హనుమ విహారీల పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల చివరి వారంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఐసీసీ డెడ్‌లైన్ ప్రకారం మే 7లోపు జట్లను ప్రకటించాలి. మార్పులు చేర్పులకు మే 22 వరకు అవకాశం ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన జట్టునే బీసీసీఐ దాదాపు కొనసాగించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ బయల్దేరనుంది.
జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. లండన్‌లో రహానేకు మంచి రికార్డు ఉండటం, స్వింగ్ బౌలింగ్ ఆడగలిగే సామర్థ్యం ఉండటం అతనికి కలిసొచ్చే అంశాలు. ఇదే సూపర్ ఫామ్‌ను రహానే కొనసాగిస్తే వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోనూ చోటు దక్కించుకుంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రహానే జట్టులోకి వస్తే సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.