Indian Squad For T20 WC 2022: అందుకే మహమ్మద్ షమీని తీసుకోలేదు!

న్యూఢిల్లీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడి జట్టు వివరాలను చేతన శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. ఫిట్‌నెస్ సాధించిన జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి పునరాగమనం చేయగా.. చాన్నాళ్లుగా టీ20లు ఆడని సీనియర్ పేసర్ మహ్మద్ షమిని ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా ఎంపిక చేయడం విశేషం. మూడు మార్పులు మినహా దాదాపు ఆసియాకప్ జట్టునే కొనసాగించారు. గాయంతో జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశం ఇచ్చారు.

రోహిత్ వద్దనడంతోనే..
సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని స్టాండ్‌బైగా ఎంపిక చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సెలెక్టర్ల తీరు తప్పుబట్టారు. వాస్తవానికి టీ20 వరల్డ్‌కప్ 2022 జట్టులోకి మహ్మద్ షమీని ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. 15 మందితో కూడిన ఈ జట్టులోకి 14 మంది పేర్లని ఏకాభిప్రాయంతో ఖాయం చేసిన సెలెక్టర్లు.. 15వ ప్లేయర్ ఎంపిక నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం జరిగిన సెలెక్షన్ కమిటీ మీటింగ్‌కి ఈ ఇద్దరు కూడా హాజరయ్యారు.

లెఫ్టాండర్లను కట్టడి చేయవచ్చని..
15వ ప్లేయర్ రేసులో మహ్మద్ షమీ, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ అభిప్రాయాన్ని సెలెక్టర్లు కోరినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది. దాంతో.. బాగా ఆలోచించిన రోహిత్ శర్మ.. అశ్విన్‌కే ఓటేసినట్లు సమాచారం. దానికి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా మద్దతు తెలిపాడట. దాంతో షమీ స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. అశ్విన్ బౌలింగ్ లైనప్‌లో ఉంటే వేరియేషన్ ఉండటంతో పాటు లెప్ట్ హ్యాండర్లను కట్టడి చేయచ్చని రోహిత్ శర్మ భావించినట్లు తెలుస్తోంది.

షమీని తీసుకోవాల్సింది..
ఇక మహమ్మద్ షమీని ఎంపిక చేయకపోవడాన్ని మాజీ క్రికెటర్లు సబా కరీం, కృష్ణమాచారి శ్రీకాంత్‌లు తప్పుబడుతున్నారు. ఆస్ట్రేలియా వంటి పేస్ పిచ్‌లపై హర్షల్ పటేల్ కంటే షమీ ఎక్కువ ప్రభావం చూపగలడని, పేస్‌తో పాటు బౌన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడని అభిప్రాయపడ్డాడు. తానే సెలెక్టర్‌ను అయితే మాత్రం హర్షల్ పటేల్‌కు బదులు షమీని తీసుకునేవాడినని సబాకీరం చెప్పుకొచ్చాడు. బుమ్రా, హర్షల్ ఫిట్‌నెస్‌పై నెలకొన్న సందేహం నేపథ్యంలోనే షమీని స్టాండ్‌బై ఎంపిక చేశారని అభిప్రాయపడ్డాడు.

టీ20 వరల్డ్‌కప్ 2022కి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications