హైదరాబాద్: 'వన్డే ప్రపంచకప్ చూడ ముచ్చటగా ఉంది. ఈ సారి ఎలాగైనా ఈ ట్రోఫీని ముద్దాడుతాం'అని వన్డే ప్రపంచకప్ టైటిల్‌తో ఫొటో దిగుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇవి. సొంతగడ్డపై ఈ మెగా టోర్నీ జరగనుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. చివరిసారిగా 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది.
అప్పటి నుంచి మరో ప్రపంచకప్ గెలవలేకపోయింది. గత 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. 2015, 2019 ప్రపంచకప్‌లో అదిరిపోయే ప్రదర్శన కనబర్చిన కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేసింది. అటు టీ20 ప్రపంచకప్‌ల్లోనూ టీమిండియాకు ఇదే పరిస్థితి. ఈ క్రమంలోనే 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలవాలని అటు ఆటగాళ్లు.. ఇటు అభిమానులు కోరుకుంటున్నారు.

కానీ టీమిండియాకు ప్రపంచకప్ గెలిచే సీన్ ఉందా? అంటే లేదనే సమాదానం వినిపిస్తోంది. భారత పౌరుడిగా ప్రపంచకప్ గెలుస్తుందని చెప్పి దేశభక్తి చాటుకున్నంత మాత్రానా అది నిజం కాదని మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్ తెలిపాడు. వాస్తవాలు మాట్లాడుకుంటే భారత జట్టులో చాలా లోపాలున్నాయని చెప్పాడు. సీనియర్ ఆటగాళ్ల గాయాలతో మిడిలార్డర్ బలహీనంగా మారిందన్నాడు.
ప్రస్తుతం భారత జట్టులో టాప్-5 ఆటగాళ్లలో ఒక్క లెఫ్టాండర్ లేడు. గత టోర్నీల్లో టీమిండియా వైఫల్యానికి ఇది ప్రధాన కారణమైంది. ముఖ్యంగా లెఫ్టార్మ్ పేసర్‌ను ఆడటంలో భారత టాపార్డర్ తీవ్రంగా తడబడింది. మరి ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిందా? అంటే లేనేలేదు. యువరాజ్ సింగ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డాడు.
టీమిండియా లోపాలను సరిచేయడంపై మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టడం లేదని విమర్శించాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్లను పరిశీలిస్తే టాప్-5 బ్యాటర్లలో ఒక లెఫ్టాండర్ ఉన్నాడు. కొసమెరుపు ఏంటంటే ఆ లెఫ్టాండరే రెండు ఫైనల్స్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఎవరో కాదు గౌతమ్ గంభీర్.
టాప్-3 బ్యాటర్లలో ఒక లెఫ్టాండర్ కచ్చితంగా ఉండాలని రవి శాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం వయసు పైబడిందని శిఖర్ ధావన్‌ను పక్కనపెట్టేసింది. కనీసం ఇషాన్ కిషన్‌కు అయినా టాప్-3లో అవకాశాలు కల్పించిందా? అంటే అది లేదు. మరోవైపు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా లేరనే వార్తలు జట్టును మరింత కలవరపడుతున్నాయి.

ఈ ఇద్దరూ అందుబాటులోకి లేకుంటే తిలక్ వర్మను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. రోహిత్ శర్మ, శుభ్ గిల్ ఓపెనింగ్ చేస్తే.. ఫస్ట్ డౌన్‌లో తిలక్ వర్మను ఆడించాలని, నాలుగో స్థానంలో అనుభవం కలిగిన కోహ్లీ ఆడుతాడని సూచిస్తున్నారు. తిలక్ వర్మకు బ్యాకప్ ప్లేయర్‌గా యశస్వీ జైస్వాల్‌ను తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచకప్‌కు ఫర్‌ఫెక్ట్ కాంబినేషన్:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ/యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్/ సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ/మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్
2011 వన్డే ప్రపంచకప్ విన్నింగ్ టీమ్:
వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్
రవిచంద్రన్ అశ్విన్, పియూష్ చావ్లా, యూసఫ్ పటాన్, ఆశిష్ నెహ్రా
టీ20 ప్రపంచకప్ విన్నింగ్ టీమ్:
గౌతమ్ గంభీర్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, శ్రీశాంత్, ఆర్‌పీ సింగ్
దినేశ్ కార్తీక్, వీరేంద్ర సెహ్వాగ్, పియూష్ చావ్లా, అజిత్ అగార్కర్