మహిళల టీ20 ప్రపంచకప్ జట్టులో తెలుగు అమ్మాయి!

న్యూఢిల్లీ: యువ క్రికెటర్, తెలుగు అమ్మాయి అంజలి శర్వాణి మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైంది. సౌతాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10-26 మధ్య జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టును ఆలిండియా మహిళల సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టులో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 25 ఏళ్ల అంజలికి చోటు దక్కింది.
పేస్ బౌలర్ అయిన అంజలి ఇటీవల ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఆకట్టుకోవడంతో ప్రపంచకప్ జట్టులో అవకాశం దక్కించుకుంది. సీనియర్ పేసర్ శిఖా పాండేకు కూడా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. 2021 అక్టోబర్‌లో వివాదాస్పద రీతిలో టీమ్ నుంచి తప్పించిన తర్వాత ఆమెను తిరిగి తీసుకున్నారు.

హర్మన్‌ప్రీత్ సారథ్యంలో..
హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ఈ జట్టుకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆసీస్‌తో సిరీస్‌లో విఫలమైన జెమీమా టీమ్‌లో చోటు నిలబెట్టుకుంది. పేసర్ల కోటాలో రేణుకా ఠాకూర్, పుజా వస్త్రాకర్ ఎంపికయ్యారు. కానీ, వస్త్రాకర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బోర్డు ప్రకటించింది. స్పిన్ కేటగిరిలో ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, దేవికా వైద్యతో పాటు రాధా యాదవ్, రాజైశ్వరి ఎంపికయ్యారు. ప్రపంచకప్‌లో రిజర్వ్ ప్లేయర్లుగా తెలుగమ్మాయి సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు.

పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్..
వరల్డ్‌కప్‌లో గ్రూప్2లో ఉన్న టీమిండియా.. ఫిబ్రవరి 12న తన తొలి మ్యాచ్‌ను కేప్‌టౌన్‌లో పాకిస్థాన్‌తో ఆడుతుంది. 15,18, 20 తేదీల్లో వరుసగా వెస్టిండీస్, ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో తలపడనుంది. ప్రపంచకప్ కంటే ముందు జనవరి 19 నుంచి సౌతాఫ్రికాలో ఆతిథ్య జట్టు, వెస్టిండీస్‌లతో భారత జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించారు. అందులో అంజలితో పాటు మరో తెలుగమ్మాయి సబ్బినేని మేఘన చోటు దక్కించుకుంది.

టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలి వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications