ముంబై: ఆసియాకప్ 2023 టైటిల్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. వన్డే ప్రపంచకప్ ముంగిట పటిష్ట ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను తొలి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. తెలుగు తేజం తిలక్ వర్మకు మరోసారి అవకాశమిచ్చారు. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.

ఈ రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడో వన్డేతో రోహిత్ శర్మ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకుంటాడు. అతనితో పాటు కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కూడా రీఎంట్రీ ఇస్తారు. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే అక్షర్ పటేల్ కూడా మూడో వన్డేకు అందుబాటులోకి వస్తాడు..
వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఈ మూడు వన్డేల సిరీస్ ఇరుజట్లకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. సెప్టెంబరు 22న మొహాలీ వేదికగా తొలి వన్డే, సెప్టెంబరు 24న ఇండోర్ వేదికగా రెండో వన్డే, సెప్టెంబరు 27న రాజ్‌కోట్ వేదికగా మూడో వన్డే జరగనుంది. అనంతరం ఇరు జట్లు ప్రపంచకప్ ఆడతాయి.
ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత భారత్, ఆసీస్ మధ్య నవంబరు 23 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. భారత్‌తో వన్డే సిరీస్ కోసం ఆసీస్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.

తొలి రెండు వన్డేలకు భారత జట్టు..:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
మూడో వన్డేకు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్*, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
భారత్‌తో మూడు వన్డేలకు ఆసీస్ జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కెరీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టాయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.