దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన ఆరాధ్య క్రికెటర్ అని టీమిండియా మహిళల జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి తెలిపింది. యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్స్‌ల వీడియోను లెక్కలేనన్ని సార్లు చూశానని చెప్పింది. యువరాజ్ సింగ్‌లా సిక్స్‌లు కొట్టడం తన కోరిక అని ఈ కడప అమ్మాయి తన మనసులోని మాటను బయట పెట్టింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టులో నల్లపు రెడ్డి శ్రీచరణి కీలక సభ్యురాలు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అద్వితీయమైన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. అత్యుత్తమ ప్రదర్శన(3/41). దీప్తి శర్మ(19) తర్వాత భారత తరఫున సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచింది.
ప్రత్యర్థికి పరుగులివ్వకుండా కట్టడి చేయడం శ్రీచరణి ప్రత్యేకత. ఫైనల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పూర్తిగా శ్రీచరణిపైనే ఆధారపడింది. ఒక ఎండ్‌లో శ్రీ చరణితో కట్టడిగా బౌలింగ్ చేయించి.. మరో ఎండ్‌లో వికెట్ల కోసం హర్మన్ ప్రయత్నించింది. సౌతాఫ్రికా బ్యాటర్ బోష్‌ను శ్రీ చరణి డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన తీరు అద్భుతం. 21 ఏళ్ల వయసులోనే ఎలాంటి ఒత్తిడి లేకుండా సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసిన శ్రీ చరణి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీ చరణి తన ఆరాధ్య క్రికెటర్ ఎవరో చెప్పింది. యువరాజ్ సింగ్‌తో పాటు స్మృలి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా తన ఫేవరేట్ క్రికెటర్లని తెలిపింది. 'క్రికెట్‌లో యువరాజ్ సింగ్, స్మృతి మంధాన, హర్మన్, జెమీమా అంటే నాకు చాలా ఇష్టం. యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన వీడియో అయితే ఇప్పటివరకు ఓ లక్ష సార్లు చూడొచ్చు. ఎప్పటికైనా యువరాజ్ సింగ్‌లా సిక్సర్లు కొట్టాలనేది నా కోరిక. ప్రస్తుతానికైతే బౌలింగ్ పైనే ఫోక్‌స పెట్టాను. జట్టు అవసరానికి తగ్గట్టు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తాను.'అని చెప్పుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి అనూహ్యంగా క్రికెట్‌వైపు అడుగులు వేసింది. ఆమె జీవిత ప్రయాణం గురించి వింటే ప్రపంచకప్ గెలిపించడానికే ఆమె క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుందా అనిపిస్తోంది. శ్రీ చరణి తొలుత ఖోఖోలో జాతీయస్థాయిలో రాణించింది. అథ్లెటిక్స్‌లోనూ అవకాశం అందుకుంది. కానీ పదోతరగతి చదువుతున్న సమయంలో క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకుంది. ముందుగా తన నిర్ణయాన్ని తండ్రి చంద్రశేఖర రెడ్డి, తల్లి రేణుక వ్యతిరేకించారు. కానీ కూతురు పట్టుదల చూసి ఆ దిశగా ప్రోత్సహించారు.