సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా అనూహ్య ఓటమితో ప్రారంభించింది. కోల్‌కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో పేలవ బ్యాటింగ్‌తో విజయవకాశాలను దెబ్బతీసుకుంది. మరోవైపు అద్భుత బౌలింగ్‌తో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ గౌహతి వేదికగా నవంబర్ 22(శనివారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు తొలి టెస్ట్ తరహాలోనే రెండో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీస్ స్వీప్ చేసి సరికొత్త చరిత్రను లిఖించాలని సౌతాఫ్రికా భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రెండో టెస్ట్‌కు టీమిండియా కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన ఫలితం దక్కలేదు. అంతేకాకుండా మెడనొప్పితో ఆసుపత్రిపాలైన శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్ ఆడటంపై సందేహం నెలకొంది. అతను పూర్తిగా కోలుకున్నా.. ముందస్తు చర్యల్లో భాగంగా విశ్రాంతి ఇవ్వనున్నారు. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగుతాడు.

నాలుగో స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌పై కూడా వేటు పడనుంది. ఆఫ్ స్పిన్నర్‌ను జట్టులో ఉంచాలనుకుంటే అక్షర్ పటేల్‌పై వేటు పడుతుంది. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వవచ్చు. నలుగురు స్పిన్నర్లతోనే ఆడాలనుకుంటే మాత్రం గిల్ స్థానంలో సాయి సుదర్శన్ రీఎంట్రీ ఇస్తాడు. రెండో టెస్ట్‌కు టీమిండియా సమతూకమైన పిచ్‌ను అడగవచ్చు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే ఛాన్స్ లేదు.
తొలి టెస్ట్‌లో విఫలమైన ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటాలి. తొలి టెస్ట్‌లో బౌలర్లు మెరుగైన ప్రదర్శనే చేశారు. బ్యాటర్లే మెరుగవ్వాల్సి ఉంది. అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాల్సి ఉంది.