సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి వన్డే తరహాలోనే రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తద్వారా ఆఖరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉంది.
మరోవైపు తొలి వన్డేలో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న సౌతాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ రేసులో నిలవాలనే పట్టదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగడం.. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో అప్‌కమింగ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఇరు జట్లు రాయ్‌పూర్ చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. అయితే తొలి వన్డేలో రిషభ్ పంత్‌ను పక్కనపెట్టి రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించడం విమర్శలకు దారి తీసింది. ఈ అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతను దేశవాళీ క్రికెట్ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్‌కు మరో అవకాశం ఇస్తారా? లేక రిషభ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకొస్తారా? అనేది చూడాలి. ఒకవేళ పంత్‌ను ఆడించాలనుకుంటే రుతురాజ్ బెంచ్‌కు పరిమితమవుతాడు. ఈ ఒక్క మార్పు మినహా తుది జట్టును మార్చే అవకాశాలు లేవు.

ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు. తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ నిరాశపర్చాడు. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో అతనికి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను సత్తా చాటాలి. మరోవైపు రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. తొలి వన్డేలో అద్భుత శతకంతో కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు.
నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్‌ల్లో ఒకరు బరిలోకి దిగనున్నారు. వాషింగ్టన్ సుందర్ ఐదో స్థానంలో ఆడనుండగా.. కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. సుందర్ విఫలమైనా.. రాహుల్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఏడో స్థానంలో జడేజా దూకుడుగా ఆడి విలువైన పరుగులు జోడించాడు.
స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా.. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణలు పేసర్లుగా కొనసాగనున్నారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు ధ్రువ్ జురెల్, తిలక్ వర్మకు నిరాశే ఎదురవ్వనుంది. ఆల్‌రౌండర్ కోటాలో ఆడాల్సిన నితీష్ కుమార్ రెడ్డి పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతుండటంతో పక్కనపెట్టేసారు. అతని స్థానంలో హర్షిత్ రాణాను ఆడిస్తున్నారు. హర్షిత్ రాణా తొలి వన్డేలో 3 వికెట్లతో సత్తా చాటాడు.
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్/రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్), కీపర్, రిషభ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.