అండర్ 19 ఆసియా కప్ 2025 ఫైనల్లో దాయాదీ పాకిస్థాన్ చేతిలో భారత జట్టుకు ఎదురైన ఘోర పరాజయంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బోర్డు సభ్యులు.. హెడ్ కోచ్‌తో పాటు కెప్టెన్ వివరణ కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ పరాజయం నేపథ్యంలో సోమవారం వర్చువల్‌గా సమావేశమైన బోర్డు సభ్యులు.. అండర్ 19 ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో దిద్దుబాటు చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
'అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో భారత ఓటమిపై బోర్డు సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు. 347 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 156 పరుగులకే ఆలౌటవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పేలవ ప్రదర్శనపై టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి బోర్డు వివరణ కోరనుంది. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మాత్రేలతో బోర్డు సభ్యులు చర్చించనున్నారు.

అండర్ 19 ప్రపంచకప్ ముందు ఈ ఘోర పరాజయం ఎదురవ్వడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. మెగా టోర్నీకి ముందు జట్టులోని లోపాలను సరిదిద్ది, ప్రపంచకప్‌లో అత్యుత్తమ జట్టును బరిలోకి దించాలని బీసీసీఐ యోచిస్తుంది.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు.
ఆదివారం జరిగిన అండర్ 19 ఆసియాకప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ అండర్ 19 టీమ్ 191 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ అండర్ 19 టీమ్ నిర్ణీ 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోర్ చేసింది. సమీర్ మిన్హాస్(113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 172) భారీ శతకంతో రాణించాడు.
అనంతరం భారత్ అండర్ 19 టీమ్ 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. అలీ రాజా(4/42) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సయ్యమ్(2/38), అబ్దుల్ సుభమ్(2/29), హుజైఫా అషాన్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు.