
అశ్విన్ ఆగయా..
తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి రానున్నాడు. వాస్తవానికి అశ్విన్‌ను పక్కనపెట్టి జడేజాను తీసుకోవడమే భారత క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కాకపోతే వాతావరణ పరిస్థితులు, జడేజా బ్యాటింగ్ సామర్థ్యం అశ్విన్‌ను పక్కనపెట్టేలా చేశాయి. భారత మిడిలార్డ్ బ్యాటింగ్ బలహీనత, లండన్, నాటింగ్‌హామ్ వాతావరణ పరిస్థితులతో జడేజాను జట్టులోకి తీసుకోకతప్పలేదు.
నలుగురు పేసర్లు ఏకైక స్పిన్నర్ రూల్‌తో బరిలోకి దిగడంతో తుది జట్టులో అశ్విన్‌కు చోటు లేకుండా పోయింది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించిన జడేజా బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. టీమిండియా పేసర్లు వికెట్లు తీయడంతో పాటు విజయం దక్కడంతో జడేజా బౌలింగ్ వైఫల్యం పెద్దగా కనిపించలేదు. కానీ పేసర్లే రాణించకుంటే భారత పరిస్థితి దారుణంగా ఉండేది.

విఫలమైన జడేజా..
తొలి టెస్ట్‌లో 16 ఓవర్లు వేసిన జడేజా ఒక్క వికెట్ తీయకపోగా.. ఓవర్‌కు 3.30 చోప్పున పరుగులిచ్చి ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జడేజా బౌలింగ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. ఇక రెండో టెస్ట్‌లో 28 ఓవర్లు వేసిన జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేదు. 48 పరుగులిచ్చాడు. అంతేకాకుండా తరుచు ఫుల్ లెంగ్త్ బాల్స్, హాఫ్ వ్యాలీలు వేస్తూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ పని సులువు చేశాడు.
దాంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా వారు బ్యాటింగ్ చేశారు. మరోవైపు ఇదే మైదానంలో ఆడిన ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ మూడు వికెట్లు తీశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనే కాదు ఈ ఇంగ్లండ్ పర్యటనలోనే జడేజా తీసింది రెండు వికెట్లు మాత్రమే. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఒక వికెట్.. సెలెక్ట్ కౌంటీ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మరో వికెట్ పడగొట్టాడు. మరోవైపు అశ్విన్ మాత్రం అద్భుత ప్రదర్శన కనబర్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగు కీలక వికెట్లు తీసిన అతను.. కౌంటీ క్రికెట్‌లో సర్రే టీమ్ తరఫున 6/27 వికెట్లతో చెలరేగాడు.

లీడ్స్ పరిస్థితులు కూడా..
జడేజా వైఫల్యంతో పాటు మూడో టెస్ట్ జరిగే లీడ్స్ వాతావరణ పరిస్థితులు కూడా అశ్విన్ బరిలోకి దిగడానికి అనుకూలంగా ఉన్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం మ్యాచ్ జరిగే రోజుల్లో లీడ్స్‌లో వర్షం పడే అవకాశం లేదు. ఎండలు ఉండనున్నాయి. దాంతో పిచ్‌పై మంచి టర్న్ లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా పిచ్ పూర్తిగా డ్రైగా మారి చివరి రెండు రోజులు స్పిన్నర్ల ఆధిపత్యం నడిచే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే భారత జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఒకవేళ 4+1 (నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్) ఫార్మూలాకు కట్టుబడితే మాత్రం జడేజా స్థానంలో అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చు. ఇషాంత్ శర్మ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. అయితే శార్దూల్ తొడకండరాల గాయం నయమైతే ఈ మార్పు జరగనుంది. అలా కాకుండా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే మాత్రం ఇషాంత్ శర్మ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

లార్డ్స్ టెస్ట్‌కు రెడీగా ఉండమన్నారు..
లార్డ్స్ టెస్ట్‌కు ముందు తనను సిద్దంగా ఉండమని చెప్పారని అశ్విన్ తాజాగా వెల్లడించాడు. అక్కడి వాతావరణం వేడిగా ఉంటుందన్న నేపథ్యంలో తనను ఆడించాలని భావించారని తెలిపాడు. 'రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు లార్డ్స్‌లో వాతావరణం వేడిగా ఉంది. దీంతో తుది జట్టులో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అంతకుముందే జట్టు యాజమాన్యం నాతో చెప్పింది.
కానీ ఒక్కసారిగా మ్యాచ్ ప్రారంభమయ్యే రోజు ఉదయం అనుకోకుండా వర్షం కురిసింది. ఆ తర్వాత కూడా ఆకాశం మేఘాలతోనే నిండి ఉంది. దీంతో తిరిగి నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తోనే భారత్ బరిలోకి దిగింది. అలా రెండో టెస్టులో నేను ఆడకపోవడానికి వాతావరణమే కీలక పాత్ర పోషించింది' అని అశ్విన్ తెలిపాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మూడో టెస్ట్‌లో అశ్విన్ ఆడటం ఖాయమనిపిస్తోంది.

స్పిన్నర్లు మినహా..
స్పిన్నర్ల విషయం మినహా.. లీడ్స్ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. వీరు కూడా పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ జట్టుకు తిప్పలుతప్పకపోవచ్చు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

భారత తుది జట్టు(అంచనా):
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ/రవీంద్ర జడేజా(వాతావరణం బట్టి)


Click it and Unblock the Notifications
