జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా.. ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో టీమిండియా బెంచ్ ఆటగాళ్లను ఆడించే అవకాశం ఉంది.
మరోవైపు ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి తమ అభిమానులను సంతోషపరచాలని జింబాబ్వే భావిస్తోంది. బెంచ్ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తే రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వస్తారు. వాస్తవానికి ఈ సిరీస్‌లో టాప్-3 బ్యాటర్లకు మినహా ఇతరులకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.

శ్రీలంక పర్యటన నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరిని తప్పిస్తే.. అభిషేక్ శర్మ ఓపెనర్‌గా ఆడుతాడు. రియాన్ పరాగ్ మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతాడు. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగుతాడు. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్.. తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. యశస్వి జైస్వాల్‌ను కొనసాగించాలని భావిస్తే అభిషేక్ శర్మపై వేటు పడనుంది.
బెంచ్ ఆటగాళ్లను ఆడించాలనే ఆలోచన లేకుంటే తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్‌లో బరిలోకి దింపాలనుకుంటే ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్‌పాండే ఉద్వాసనకు గురవుతారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్, స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే బరిలోకి దిగనున్నాడు.

జింబాబ్వేతో ఐదో టీ20.. భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్/అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, సంజూ శాంసన్/ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్/ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్.