జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పల్ప మార్పులు చేసింది. బెరిల్ హరికేన్ ప్రభావంతో రెండు రోజులుగా ప్రపంచకప్ గెలిచిన టీమిండియా బార్బడోస్‌లో చిక్కకుపోయింది. దాంతో ఆ జట్టులో భాగమైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ను జింబాబ్వే పర్యటనలోని తొలి రెండు టీ20ల నుంచి బీసీసీఐ తప్పించింది.
వారి స్థానాల్లో ఐపీఎల్‌లో సత్తా చాటిన హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, జితేశ్ శర్మలను ఎంపిక చేసింది. ముందుగానే ఈ పర్యటన నుంచి ప్రపంచకప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతినిచ్చారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఈ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.

అభిషేక్ శర్మ అరంగేట్రం..
ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఈ యంగ్ టీమ్ జింబాబ్వేలో అడుగుపెట్టింది. బుధవారం నుంచి సన్నాహకాలు ప్రారంభించనుంది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ శనివారం(జూలై 6) హరారే వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబేలు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్ సత్తా చాటిన కుర్రాళ్ల అరంగేట్రానికి మార్గం సుగుమమైంది. శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేయనుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్‌లో ఆడవచ్చు. ఓపెనింగ్ జోడీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే అభిషేక్ శర్మ ఓపెనర్‌గా.. రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ డౌన్‌లో ఆడుతాడు.
రియాన్ పరాగ్‌కు ఛాన్స్..
యశస్వి జైస్వాల్ దూరమైన నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్‌కు మార్గం సుగమమైంది. సంజూ శాంసన్ గైర్హాజరీలతో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగుతాడు. దాంతో జితేశ్ శర్మ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. శివమ్ దూబే అందుబాటులో లేకపోవడంతో రియాన్ పరాగ్‌కు తుది జట్టులో చోటు దక్కనుంది. అతని నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు.
ప్రపంచకప్ జట్టుతోనే ఉన్న రిజర్వ్ ప్లేయర్ రింకూ సింగ్ ఫినిషర్‌గా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. అయితే రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ రాకపై క్లారిటీ లేదు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్, మణికట్టు స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్‌లు బరిలోకి దిగనుండగా.. ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ఒకవేళ ఖలీల్ అహ్మద్ అందుబాటులోకి రాకపోతే తుషార్ దేశ్‌పాండే లేదా హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తారు
జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్/హర్షిత్ రాణా, ముఖేష్ కుమార్.