India Playing XI vs Sri Lanka: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో సిక్సర్ కొట్టిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శ్రీలంకతో గురువారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని వాంఖడే మైదానం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండగా ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి.
వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు అఫ్గానిస్థాన్ చేతిలో ఓడిన శ్రీలంక.. మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో ఉంది.

చీలమండ గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ నేపథ్యంలో జట్టుతో కలుస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసి బంతిని ఆపే క్రమంలో గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.
ప్రస్తుతం అతను ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు. టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న క్రమంలో హార్దిక్ విషయంలో మేనేజ్‌మెంట్ తొందరపడటం లేదు. పూర్తిగా కోలుకున్న తర్వాతనే బరిలోకి దించాలనుకుంటోంది. నేరుగా సెమీస్‌లోనే ఆడించే భావనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా సెమీస్ ఆడించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో అతన్ని జట్టుతోనే ఉంచాలని మేనేజ్‌మెంట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను ముంబైలో జట్టుతో కలుస్తాడని జాతీయ మీడియా పేర్కొంది.

ఈ క్రమంలోనే శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి. జట్టుతో కలిసినా అతన్ని ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉంచుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా జట్టులోకి వస్తే మాత్రం సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితమవుతాడు.
లేదంటే సూర్య కొనసాగుతాడు. వరుసగా విఫలమవుతున్న మహమ్మద్ సిరాజ్‌ను కూడా పక్కనపెట్టే అవకాశాలున్నాయి. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ఆడించవచ్చు. ముంబై పిచ్ పేస్‌కే అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లతోనే ఆడనుంది. బ్యాటింగ్ విభాగంలో వరుసగా విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్‌ను తప్పించాలనుకుంటే ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడు.
శ్రీలంకతో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్/హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్/శార్దూల్ ఠాకూర్.