ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో లీగ్ దశను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్-8 పోరుకు సిద్దమైంది. వరుసగా నాలుగు విజయాలతో టీమిండియా జోరు మీద ఉంది. సూపర్-8లో గ్రూప్-1లో ఉన్న టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను అహ్మదాబాద్ వేదికగా ఆదివారం సౌతాఫ్రికాతో తలపడనుంది. లీగ్ దశలో అమెరికా కాస్త పోటీ ఇచ్చినా.. మిగతా మూడు మ్యాచ్‌లను టీమిండియా ఏకపక్షంగా గెలిచింది.
అయితే సూపర్-8లో టీమిండియాకు అసలు సిసలు సవాల్ ఎదురు కానుంది. సౌతాఫ్రికా కూడా గ్రూప్-డీలో నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచి మంచి జోరు మీద ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అయితే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మను కొనసాగిస్తారా? లేక పక్కనపెడుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అతను గత 5 మ్యాచ్‌ల్లో 4 సార్లు డకౌటయ్యాడు. పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ 0(1), 0(4), 0(3) నిరాశపర్చాడు. దాంతో అతని స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. కొన్ని మ్యాచ్‌లకు రెస్ట్ ఇస్తే అతనిపై ఒత్తిడి కూడా తగ్గుతుందని, ఆ తర్వాత అతను రిథమ్ అందుకుంటాడని సూచిస్తున్నారు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ అభిషేక్ శర్మకు అండగా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ అభిషేక్ శర్మ బరిలోకి దిగితే అతను ఫామ్ అందుకోవాలి. లేదంటే అతనిపై మరిన్ని విమర్శలు వస్తాయి.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతని స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ కొనసాగనుండటంతో కుల్దీప్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా పేస్ విభాగాన్ని లీడ్ చేయనుండగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండో పేసర్‌గా బరిలోకి దిగుతాడు. పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ మ్యాచ్‌కు కూడా సిరాజ్ దూరంగానే ఉండనున్నాడు.
అభిషేక్ శర్మ బరిలోకి దిగితే సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమవుతాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. గాయాలైతే తప్పా భారత కాంబినేషన్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం లేదు.
ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ/ సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.