నాలుగు టీ20ల సిరీస్ కోసం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబర్ 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ పర్యటనకు వెళ్లనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది.
భారత్-ఏ తరఫున ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నీలో సత్తా చాటిన రమణ్‌దీప్ సింగ్ సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. అతనితో పాటు కర్ణాటక బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్ కూడా తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నాడు. ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్ రీఎంట్రీ ఇచ్చారు.

మయాంక్ యాదవ్ దూరం..
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడిన రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్‌లతో పాటు పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయాలతో ఈ పర్యటనకు దూరమయ్యారు. ఇటీవలే అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టిన మయాంక్ యాదవ్ మూడు మ్యాచ్‌ల వ్యవధిలోనే గాయపడ్డాడు. ఈ జట్టులోని కుర్రాళ్లు సౌతాఫ్రికా పర్యటనలో ఏ మేరుకు రాణిస్తారో చూడాలి. సూర్యకుమార్ యాదవ్ మినహా పెద్దగా ఎవరికీ సౌతాఫ్రికా గడ్డపై ఆడిన అనుభవం లేదు. దాంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తా చాటిన సంజూ శాంసన్‌తో పాటు అభిషేక్ శర్మలు.. సఫారీ గడ్డపై టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్‌లో ఆడనుండగా.. తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ బరిలోకి దిగనున్నారు. ప్రధాన పేసర్లుగా.. అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ బరిలోకి దిగనుండగా.. మూడో పేసర్‌గా యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైశాఖ్‌ల మధ్య పోటీ నెలకొంది.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత తుది జట్టు(అంచనా):
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్/విజయ్ కుమార్ వైశాఖ్.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్