సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్దమవుతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత టీ20 టీమ్.. ఈ సిరీస్ కోసం ఇప్పటికే సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. డర్బన్ వేదికగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌తో ఈ నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తెరలేవనుంది.
ఇప్పటికే కుర్రాళ్లతో కూడిన టీమిండియా ఈ సిరీస్ కోసం సన్నదమవుతోంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ తర్వాత ఇరు జట్లు మరోసారి తలపడుతున్నాయి. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో సీనియర్ టీమ్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసీస్ పర్యటనకు సిద్దమవుతుండగా.. కుర్రాళ్లతో కూడిన జట్టుకు ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్‌లో సత్తా చాటిన కుర్రాళ్లతో కూడిన ఈ జట్టులో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు వెటరన్ వికెట్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సత్తా చాటాడు. హైదరాబాద్ టీ20లో సెంచరీ సాధించాడు.
దాంతో అతన్నే ఓపెనర్‌గా కొనసాగించే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆడనుండగా.. నాలుగో స్థానంలో తెలుగు తేజం తిలక్ వర్మకు చోటు దక్కనుంది. అయితే బౌలింగ్ సామర్థ్యం కలిగిన రమణ్‌దీప్ సింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం తిలక్ వర్మ బెంచ్‌కు పరిమితమవుతాడు. ఐదో స్థానంలో రింకూ సింగ్, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు.
స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీకి చోటు దక్కనుంది. రవి బిష్ణోయ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగితే మాత్రం యశ్ దయాల్ స్థానంలో రవి బిష్ణోయ్ ఆడుతాడు.
సౌతాఫ్రికాతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ వర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ/రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, యశ్ దయాల్/రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్.
భారత టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.