India Playing XI vs New Zealand: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం ధర్మశాల వేదికగా పటిష్ట న్యూజిలాండ్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మ్యాచ్‌లు ఒక్కెత్తు అయితే ఈ మ్యాచ్ మరో ఎత్తు. న్యూజిలాండ్ సైతం ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
మెరుగైన రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. భారత్ కూడా వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి కివీస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. టేబుల్ టాప్-2 టీమ్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.

హార్దిక్ దూరం..:న్యూజిలాండ్ కూడా ఇతర జట్ల మాదిరే ఇండియాను మట్టికరిపించి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాల చేరుకున్నాయి. శనివారం ప్రాక్టీస్ చేయనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
గాయం తీవ్రత ఎక్కువగా లేకున్నా.. ఎన్‌సీఏ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతను రెస్ట్ తీసుకోనున్నాడని బీసీసీఐ ప్రకటించింది. దాంతోనే అతను టీమిండియాతో ధర్మశాలకు వెళ్లలేదు. బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లిన హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో తదుపరి మ్యాచ్ కోసం అక్కడి నుంచి నేరుగా లక్నోకు వస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

సవాల్‌గా మారిన తుది జట్టు ఎంపిక..:హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో టీమిండియా తుది జట్టు ఎంపిక రోహిత్ శర్మకు సవాల్‌గా మారింది. హార్దిక్‌ను భర్తీ చేసే పేస్ ఆల్‌రౌండర్ జట్టులో లేకపోవడం సమస్యగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా ఓ ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో పాటు స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహమ్మద్ షమీ బరిలోకి దిగనుండగా.. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ధర్మశాల పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో అశ్విన్ కూడా బెంచ్‌కే పరిమితం కానున్నాడు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలు బరిలోకి దిగనుండగా.. స్పిన్ బాధ్యతలు కుల్దీప్ యాదవ్‌తో పాటు జడేజా పంచుకోనున్నాడు. పార్ట్ టైమ్ బౌలర్లుగా రోహిత్, కోహ్లీ, సూర్య కొన్ని ఓవర్లు వేయాల్సి ఉంటుంది.
బ్యాటింగ్ విభాగంలో గిల్, రోహిత్ ఓపెనింగ్ చేయనుండగా.. కోహ్లీ, అయ్యర్, సూర్య, జడేజా మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. హార్దిక్ గైర్హాజరీ కారణంగా టీమిండియా ఓ బౌలర్ సేవలను కోల్పోవడంతో పాటు లోయరార్డర్ బ్యాటింగ్ బలహీనంగా మారనుంది.
న్యూజిలాండ్‌తో భారత్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్