న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను అనూహ్యంగా ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. పుణె వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 8 వికెట్లతో ఓటమిపాలైన భారత్.. విజయంపై కన్నేసింది. తొలి టెస్ట్‌లో చేసిన తప్పిదాలపై ఫోకస్ పెట్టింది.
ఈ నేపథ్యంలో జట్టులో కొన్ని మార్పులు తప్పవనిపిస్తోంది. అంతేకాకుండా పుణె పిచ్‌ను ర్యాంక్ టర్నర్‌గా సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి బౌలింగ్ కాబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదనిపిస్తోంది. కానీ సొంతగడ్డపై పేలవ ప్రదర్శన కనబరుస్తున్న మహమ్మద్ సిరాజ్‌పై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

13 టెస్ట్‌లు.. 19 వికెట్లు..
బెంగళూరు టెస్ట్‌లో అతను కేవలం 2 వికెట్లు మాత్రమే తీసాడు. అంతేకాకుండా భారత గడ్డపై 13 టెస్ట్‌లు ఆడిన సిరాజ్ 19 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. విదేశాల్లో మాత్రం 17 టెస్ట్‌ల్లోనే 61 వికెట్లు తీసాడు. అనుభవం దృష్ట్యా సిరాజ్‌కే అవకాశమిస్తున్నప్పుటికీ అతను కొత్త బంతితో వికెట్లు తీయలేకపోతున్నాడు.
మరోవైపు ఆకాశ్ దీప్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన మూడు టెస్ట్‌ల్లో 23.12 సగటుతో 8 వికెట్లు తీసాడు. దాంతో అతన్నే తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగితే బుమ్రాతో పాటు ఆకాశ్ దీప్ ఆడే అవకాశం ఉంది. సిరాజ్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే తుది జట్టులో కొనసాగుతాడు.
కోలుకున్న పంత్, గిల్
మోకాలి గాయానికి గురైన రిషభ్ పంత్.. పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అతను వికెట్ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. మెడనొప్పితో తొలి టెస్ట్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ కూడా పూర్తిగా కోలుకున్నాడు. గిల్ స్థానంలో తొలి టెస్ట్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్(150) శతకంతో చెలరేగాడు. గిల్ జట్టులోకి వస్తే ఎవర్నీ తప్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పైనే వేటు పడే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌లో రాహుల్(0, 12) దారుణంగా విఫలమయ్యాడు. కానీ రాహుల్ బాగానే ఆడుతున్నాడని, అతనికి అవకాశం ఇస్తామని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ చెప్పడంతో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కుల్దీప్ యాదవ్ ఔట్..
ఒకవేళ పంత్‌ను తప్పిస్తే.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఆడించవచ్చు. లేదంటే రాహుల్‌తో వికెట్ కీపింగ్ చేయించి పంత్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా కొనసాగించే అవకాశం ఉంది. లేదంటే రాహుల్‌పై వేటు పడాల్సిందే. ముగ్గురు స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్‌ను ఆడించే అవకాశం ఉంది. బ్యాటింగ్ డెప్త్ కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
భారత్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్/ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్.