India Playing XI: సంజూ ఇన్.. ఉమ్రాన్ డౌట్! న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

వెల్లింగ్టన్: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో నిరాశపరిచిన టీమిండియా.. మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగే తొలి టీ20లో ఆతిథ్య జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ సిరీస్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సీనియర్ బౌలర్లు మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ దూరంగా ఉండగా.. టీ20ల్లో హార్దిక్ పాండ్యా, వన్డేల్లో శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నారు. తొలి టీ20 కోసం తుది జట్టు ఎంపిక చేయడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఒక్కో ప్లేస్‌కు ఇద్దరేసి పోటీ పడుతుండటంతో ఎవరిని ఆడించాలనేది తేల్చుకోలేకపోతుంది.

ఆరుగురు ఓపెనర్లు..
ఓపెనింగ్ స్లాట్ కోసం ఏకంగా ఆరుగురు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2021, 2022లో ఓపెనర్ల వైఫల్యంతోనే టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఈ క్రమంలోనే సరైన ఓపెనింగ్ కాంబినేషన్ రెడీ చేయాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఈ సిరీస్‌కు రోహిత్, రాహుల్ లేకపోవడంతో వారి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ ఓపెనింగ్ స్లాట్ కోసం యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లతో పాటు దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లు పోటీపడుతున్నారు. ప్రపంచకప్ వైఫల్యం అనంతరం పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలనే సలహాలు ఎక్కువయ్యాయి. అయితే తొలి టీ20లో శుభ్‌మన్ గిల్ ఒక్కడు ఆడటం ఖాయంగా తెలుస్తున్నా.. అతనికి తోడుగా ఇషాన్, పంత్‌లో ఒకరు ఆడే అవకాశం ఉంది.

మిడిలార్డర్‌లో సంజూ, సూర్య..
ఇక మిడిలార్డర్ స్లాట్‌లోనూ తీవ్ర పోటీ నెలకొంది. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పంత్ ఓపెనర్‌గా ఆడితే సంజూ శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఆడనుండగా.. ఐదో స్థానంలో దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది.
ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనుకుంటే శ్రేయస్ అయ్యర్.. బౌలింగ్ ఆప్షన్ కోసం వెళ్తే దీపక్ హుడా బరిలోకి దిగుతారు. ఒకవేళ ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడితే ఐదో స్థానంలో రిషభ్ పంత్ ఆడుతాడు. ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ పోషించనున్నాడు.

సిరాజ్‌కు చోటు దక్కెనా..?
చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌కు ఏడో స్ధానంలో ఆడనున్నాడు. జడేజా వచ్చేంత వరకు అతన్ని తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. అయితే పిచ్ కండీషన్స్ బట్టి ఈ నిర్ణయం తీసుకోనున్నారు. స్పిన్నర్ కావాలనుకుంటే సుందర్, పేసర్ కావాలనుకుంటే హర్షల్ పటేల్ బరిలోకి దిగుతాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు అతనికి సహకరించనున్నారు.
అయితే సిరాజ్‌ను ఆడించాలనుకుంటే మాత్రం ఉమ్రాన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. స్వింగ్ కండిషన్స్ కలిగిన న్యూజిలాండ్‌లో సిరాజ్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ చోటుకు డోకా లేదు. ఉమ్రాన్ ఆడించాలనుకుంటే మాత్రం అర్ష్‌దీప్, హర్షల్‌పటేల్‌లో ఒకరిని పక్కన పెట్టొచ్చు.

భారత తుది జట్టు(అంచనా):
శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్/ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా/శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్/హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్/మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications