ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమైంది. గ్రూప్-ఏలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం రాత్రి జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ మ్యాచ్ ఆడనుంది.
దాయాదీ పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో మట్టికరిపించడంతో భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచిన నెదర్లాండ్స్.. సంచలన ప్రదర్శనతో భారత్‌కు షాకివ్వాలనే పట్టుదలతో ఉంది. అద్భుతం జరగకపోతే ఈ మ్యాచ్ కూడా భారత్ ఏకపక్షంగా గెలవనుంది. ప్రత్యర్థి పసికూనే అయినా టీమిండియా ఏ మాత్రం లైట్ తీస్కోదు. అజేయంగా సూపర్-8లోకి అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉంది.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా బరిలోకి దిగి చెత్త ఫీల్డింగ్‌తో హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహానికి గురై వార్తల్లో నిలిచిన కుల్దీప్ యాదవ్‌పై వేటు పడనుంది. అహ్మదాబాద్ పిచ్ పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టిన కుల్దీప్ లేజీ ఫీల్డింగ్‌తో విమర్శల పాలయ్యాడు.

వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడిన జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తాడు. లేదంటే అతను మళ్లీ బెంచ్‌కే పరిమితమవుతాడు. మిగతా బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తీ ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఆడనున్నాడు. దాంతో వాషింగ్టన్ సుందర్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూపర్-8కు ముందు అతను గాడిలో పడితే టీమిండియాకు తిరుగుండదనుకుంటున్నారు. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన అభిషేక్ శర్మ.. పాకిస్థాన్ మ్యాచ్‌లో 4 బాల్ డక్‌గా వెనుదిరిగాడు. నెదర్లాండ్స్‌పై సత్తా చాటి ఫామ్ అందుకోవాలని అతను భావిస్తున్నాడు. అభిషేక్ శర్మ బరిలోకి దిగితే సంజూ బెంచ్‌కే పరిమితమవుతాడు.
ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. భారత బ్యాటింగ్ లైనప్‌లో ఏ ముగ్గురు రాణించినా తిరుగుండదు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.
ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా/మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తీ.