సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మాట్ ఆడేందుకు సిద్దమైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఎలా ఆడబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందే కొందరు సీనియర్ ఆటగాళ్లు భారత్-ఏ తరఫున అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌లో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రెండో అనధికారిక మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా? అని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది.

ఓపెనర్‌గా రాహుల్..
అనుభవం, టెక్నిక్ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. యశస్వి జైస్వాల్‌కు జతగా కేఎల్ రాహుల్‌నే ఓపెనర్‌గా ఆడించాలని రాబిన్ ఊతప్ప వంటి మాజీ క్రికెటర్లు సూచించారు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ రాహుల్ ఓపెనర్‌గా సత్తా చాటాడని, స్వింగ్ కండిషన్స్‌లో అతను మెరుగ్గా రాణించగలడని ఊతప్ప తెలిపాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి రాహుల్ మెరుగైన ఆరంభం అందిస్తే భారత్‌కు తిరుగుండదు.
మూడో స్థానంలో సాయి..
మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించాలని ఊతప్ప సూచించాడు. టెక్నికల్‌గా అతను మెరుగైనవాడని, పరిస్థితులకు తగ్గట్లు ఆడే ఓర్పు అతనికి ఉందని చెప్పాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. నెంబర్ 5లో కరుణ్ నాయర్‌ను ఆడించాలని చెప్పాడు. కరుణ్ నాయర్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందన్నాడు. రిషభ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఆరో స్థానంలో ఆడించాలని, రవీంద్ర జడేజాను ఏకైక స్పిన్నర్‌గా అవకాశం ఇవ్వాలన్నాడు.
నితీష్‌తో బ్యాటింగ్ డెప్త్
పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాలని ఊతప్ప చెప్పాడు. జడేజా, నితీష్ కుమార్ రెడ్డిలతో టీమిండియా బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుందని, ఇంగ్లీష్ కండిషన్స్‌లో బ్యాటింగ్ విభాగం బలంగా ఉండటం ముఖ్యమన్నాడు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణలను ఆడించాలని చెప్పాడు. నితీష్ కుమార్ రెడ్డికి శార్దూల్ ఠాకూర్‌తో పోటీ నెలకొంది. గత అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే శార్దూల్ ఠాకూర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు(అంచనా): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.