పుణె: వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. బంగ్లాదేశ్ పసికూనే కదా అని, ఏ మాత్రం లైట్ తీసుకున్నా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
అసలే ఈ మెగాటోర్నీలో వరుసగా సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. పసికూన జట్లు సంచలన ప్రదర్శనతో పటిష్ట జట్లను మట్టికరిపిస్తున్నాయి.డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను అఫ్గాన్ ఓడిస్తే.. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయాన్నందుకుంది. ఈ క్రమంలోనే భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత 12 నెలల్లో వన్డే ఫార్మాట్‌లో భారత్‌ను ఓడించిన జట్లలో ఆస్ట్రేలియా తర్వాత బంగ్లాదేశ్ మాత్రమే ఉంది. ముఖ్యంగా ఆ జట్టు స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. మెహ్‌దీ హసన్ మీరాజ్, షకీబ్ అల్ హసన్‌లను ఎదుర్కోవడం భారత్ బ్యాటర్లకు సవాలే. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో పోరును టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
తుది జట్టు ఎంపికపై కూడా సమాలోచనలు చేస్తోంది. అయితే జట్టులో మార్పులు.. పుణె పిచ్ కండిషన్స్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ మైదానంలో ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి. సహజంగా పుణె పిచ్ నెమ్మదిగా ఉండటంతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. ప్రపంచకప్ మ్యాచ్ కోసం కొత్త పిచ్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
బ్లాక్ సాయిల్‌తో పిచ్‌ను సిద్దం చేస్తే.. టీమిండియా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అప్పుడు శార్దూల్ ఠాకూర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ను సిద్దం చేస్తే మాత్రం శార్దూల్ ఠాకూర్‌ను కొనసాగిస్తారు. అయితే శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహమ్మద్ షమీని ఆడించడం ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శార్దూల్ ఠాకూర్ అరకొర ఆటగాడని, గత 30 మ్యాచ్‌ల్లో అతను మూడు సార్లు మాత్రమే 10 ఓవర్ల కొటాను పూర్తి చేశాడని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. అందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉందని, హార్దిక్ పాండ్యా ఉన్న నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ సేవలు అవసరం లేదని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే పిచ్ పేస్‌కు అనుకూలిస్తే షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ శార్దూల్‌కు అండగా నిలవాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తే అతనే జట్టులో కొనసాగుతాడు. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు. దాంతో ఇషాన్ కిషన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ 3, 4, 5 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు.
బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నారు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. మరోవైపు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. దాంతో అశ్విన్, షమీకి మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
బంగ్లాదేశ్‌తో భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/మహమ్మద్ షమీ/రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.